గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummadi Sandhya Rani) పనితీరుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టితో సాగుతున్నా.. రాజకీయంగా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. 2024 జూన్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె పలు కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. సాధించిన ప్రగతి బాగున్నా.. దీంతో పాటు ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీకి మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో 'డోలి' మోత కష్టాలను దూరం చేయడానికి సుమారు 1,300 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణ పనులను ప్రాధాన్యతగా చేపట్టారు. మొత్తం 2,500 కోట్లు కేటాయించి రహదారుల అనుసంధానానికి కృషి చేస్తున్నారు. వైద్యం, అత్యవసర సేవల విషయంలో కొండ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు సాధారణ అంబులెన్సులు వెళ్లలేని పరిస్థితులను అధిగమించేందుకు ఫీడర్/బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు.
తొలి సంతకం ఏమైంది..?
గిరిజన పాఠశాలల్లో(Tribal Schools) పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి 44 మంది ఏఎన్‌ఎంల నియామకంపై ఆమె మొదటి సంతకం చేశారు. కానీ.. ఇప్పటి వరకు నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడం గమనార్హం. ఇక, గిరిజనుల ఉపాధిని పెంచడానికి అరకు కాఫీ సాగును ఒక లక్ష ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 24 కోట్లతో గోకులాలు ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. గిరిజన విద్యార్థుల కోసం మెరుగైన వసతులు, కోచింగ్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
జీవో నెం. 3 పునరుద్ధరణ: గిరిజన నిరుద్యోగులకు మేలు చేసేలా చర్యలు తీసుకున్నా.. ఇది రాజ్యాంగపరమైన అంశం కావడంతో అటకెక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇక, వివాదాల విషయానికి వస్తే.. కుటుంబ పెత్తనాన్ని ఆమె తగ్గించలేక పోతున్నారు. మారుమూల గిరిజన గ్రామాలలో దాదాపు 1,100 గ్రామాలకు తాగునీరు అందించినట్లు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిపై గిరిజనుల(Tribals) నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గమైన సాలూరు(Salur)లో స్థానిక నేతలతో కొన్ని అంతర్గత విభేదాలు రావడం, అలాగే ఆమె కుటుంబ సభ్యులు, పీఏపై సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఆరోపణలు వంటి కొన్ని వివాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వ అంతర్గత రేటింగ్స్ ప్రకారం.. 2025 ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల శాఖల వారీగా నిర్వహించిన అంతర్గత పనితీరు సమీక్షలోమంత్రి సంధ్యా రాణి వెనుకబడ్డారు. దీంతో ఇప్పుడు రేటింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏదేమైనా అభివృద్ధి పనుల్లో శ్రద్ధ చూపుతున్నా.. వ్యక్తిగత రాజకీయాలను ఆమె సరిచేసుసకోలేక పోతున్నారన్న వాదన ఉంది.