ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారి ఒకే దఫా 51 మందిపై రౌడీషీట్లు తెరిచి విచా రించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వీరంతా వైసీపీ నాయకులే కావడం గమనార్హం. వీరిలోనూ.. ప్రస్తుత ఎమ్మెల్సీ తలశిల రఘురాం, విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ సహా.. గుంటూరుకు చెందిన 20 మంది ఇతర ప్రాంతాలకు చెందిన మరో 20 మంది సహా మొత్తం 51 మంది ఉన్నారు. దీనికి సంబంధించి హోం శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు.. విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు.. ఉత్తర్వులు జారీ చేశారు.
ఎందుకు?
2022-23 మధ్య మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. అప్పట్లో వైసీపీ నాయకు లు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు కర్రలతో కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగుల గొట్టారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దీనిని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ సమర్థించుకున్నారు. భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు విచారించారు. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంపై పోలీసులు మౌనం వహించారు. కేసు విచారణ మాత్రం కొనసాగుతోందని చెబుతున్నారు. తాజాగా విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ ఉపాధ్యా యులపై జరిగిన భౌతిక దాడుల ఘటనల నేపథ్యంలో నాటి టీడీపీ ఆఫీసుపై దాడి కేసును తిరగదోడారు. మొత్తం ఆనాటి ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 51 మందిపై రౌడీ షీట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రౌడీ షీట్ తెరిస్తే.. ఏం జరుగుతుంది
ఒక వ్యక్తిపై రౌడీషీట్ తెరిస్తే.. అతని స్వేచ్ఛకు నియంత్రణ ఉంటుంది. ఆ వ్యక్తి ప్రవర్తన, రాకపోకలు, కార్యకలాపా లపై స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైనప్పుడు లేదా ఏవైనా అల్లర్లు, నేరాలు జరిగినప్పుడు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించవచ్చు. ఆ వ్యక్తి చేసే ప్రతి చట్టవిరుద్ధ మైన చర్య లేదా నేరపూరిత సమాచారాన్ని ఆ రౌడీ షీట్‌లో ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఉద్యోగ విచారణలు, ప్రభుత్వ వెరిఫికేషన్ల సమయంలో ఈ రికార్డుల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తరచుగా పోలీసులు విచారణకు ఆదేశించవచ్చు. సమాజంలోనూ.. రౌడీ అనే ముద్ర పడుతుంది.
వైసీపీ ఖండన
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే పాత కేసులను తిరగదోడి, డీఎస్సీ అభ్యర్థుల తరఫున చేస్తున్న పోరాటాలను అణగదొక్కడానికే తమ నేతలపై రౌడీ షీట్లు తెరుస్తూ దారుణ కుట్రకు పాల్పడుతోందని ఆరోపించింది. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ పేర్కొంది.