బాబు హామీ ఇచ్చినా.. అలక పాన్పు దిగ‌ని ఆది.!

admin
Published by Admin — November 21, 2026 in Politics, Andhra
News Image

కడప జిల్లా రాజకీయాల్లో గత రెండు రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠం విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసాతో శాంతించినట్లు మొదట వార్తలు వచ్చినా.. ఆయన రాజీనామాకే మొగ్గు చూపడం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి ఉండవల్లిలో జరిగిన కీలక భేటీ తర్వాత కూడా ఆయ‌న‌ తన మనసు మార్చుకోక‌పోవ‌డం కూటమికి త‌ల‌నొప్పిగా మారింది.

అసలు వివాదం కడప(Kadapa) జెడ్పీ ఛైర్మన్ పదవి కేటాయింపుతో మొదలైంది. కూటమి పొత్తులో భాగంగా ఈ పదవిని తన సోదరుడి కుమారుడికి ఇస్తారని ఆదినారాయణ రెడ్డి బలంగా ఆశించారు. అయితే, చివరి నిమిషంలో ఆ అవకాశం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి దక్కడంతో ఆది తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకు మాట ఇచ్చి తప్పారని, ఇది ముమ్మాటికీ తనను అవమానించడమేనని ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆదినారాయణ రెడ్డి, తన సోదరుల కుమారులు చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని తేల్చుకునేందుకు విజయవాడ చేరుకున్న ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. పొత్తు ధర్మాన్ని గౌరవించాలని, తొందరపడి రాజీనామాలు చేయవద్దని వారు నచ్చజెప్పినా ఆది వెనక్కి తగ్గలేదు. జాతీయ నాయకత్వంతో మాట్లాడాకే తన తుది నిర్ణయం ప్రకటిస్తానని ఆయన భీష్మించుకు కూర్చున్నారు.

పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కూటమి పెద్దలు, బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఆదినారాయణ రెడ్డిని నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు(CM Chandrababu)తో జరిగిన సమావేశంలో ఆది తన ఆవేదననంతా వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందుల వంటి కీలక ప్రాంతంలో కూటమి విజయం కోసం తాను శాయశక్తులా కృషి చేశానని, అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆదినారాయణ రెడ్డి వాదనను ఓపికగా విన్న చంద్రబాబు, సీట్ల సర్దుబాటులో కొన్ని అనివార్య పరిస్థితులు ఎదురయ్యాయని వివరించారు. పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం ఆయన చేసిన కృషిని ప్రభుత్వం ఎన్నటికీ మరచిపోదని, భవిష్యత్తులో తప్పకుండా సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. 

అయితే చంద్రబాబు ఇచ్చిన ఈ భరోసాతో సంతృప్తి చెంద‌ని ఆదినారాయణ రెడ్డి.. తాజాగా మ‌రోసారి మీడియా ఎదుట త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీలో బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. జడ్పీ చైర్మన్‌ ఎన్నిక విషయంలో కూట‌మి నిర్ణయం మార్చుకోకపోతే తనతో పాటు తన జడ్పీటీసీలుగా గెలిచిన అన్న కుమారులు రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి రాజీనామాల ఉపసంహరణ నిర్ణయాన్ని కూడా మార్చుకోబోమని స్పష్టం చేశారు. త్వ‌ర‌లోనే ఢిల్లీ(Delhi)కి వెళ్ల‌నున్న‌ట్లు కూడా స్ప‌ష్టం చేశారు. 

Tags
Adinarayana Reddy CM Chandrababu AP News AP Politics Andhra Pradesh AP BJP TDP Janasena
Recent Comments
Leave a Comment

Related News