నెల్లూరులో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 880 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించిందని, కానీ, తాము రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా దాదాపు 9,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు నిర్మించామని గర్వంగా చెప్పారు. వైసీపీ హయాంలో 304 మినీ గోకులాలు నిర్మిస్తే, తాము 30,000కు పైగా నిర్మించామని అన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికత, ప్రధాని మోదీ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు..
'పల్లె పండుగ 3.0' కార్యక్రమాన్ని రూ.11,085 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభిస్తున్నామని పవన్ అన్నారు.కేంద్రం వాటా రూ.5,400 కోట్లు, రాష్ట్రం వాటా రూ.5,700 కోట్లు అని వివరించారు. 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 1000 కిలోమీటర్ల డ్రైన్లు, గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, రచ్చబండలు వంటి అనేక పనులు ఈ నిధులతో చేపట్టబోతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత, పారదర్శకత విషయాలలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పవన్ అన్నారు. గ్రామంలో జరుగుతున్న పనులను ప్రజలు తమవిగా భావించి పర్యవేక్షించాలని కోరారు. కాంట్రాక్టర్లు నాణ్యతగా పనిచేస్తున్నారా లేదా అని గమనించాలని, లోపాలు కనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అవసరమైతే సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని, వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని చెప్పారు.