ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నాళ్లుగానో ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎట్టకేలకు స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను కేవలం ఆరు వారాల్లోగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామంతో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లయింది. ఈ తీర్పు వెనుక రాజకీయంగా, న్యాయపరంగా ఎన్నో కీలక పరిణామాలు ఉన్నాయి. ప్రభుత్వ విజ్ఞప్తులు, రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు, కేంద్ర గ్రాంట్ల రాక వంటి అంశాల నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బీసీ రిజర్వేషన్లపై బిగ్ ట్విస్ట్..
స్థానిక ఎన్నికల రగడలో ప్రధానంగా నిలిచిన అంశం రిజర్వేషన్ల కోటా. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు కీలక జీవోలను హైకోర్టు కొట్టివేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం దాటకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ మరియు విపక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు(High Court).. ఈ పరిమితి లోపలే రిజర్వేషన్ల ప్యాటర్న్‌ను సవరించి ఎన్నికలకు వెళ్లాలని తేల్చిచెప్పింది.
కొట్టివేయబడిన పిటిషన్లు..
మరోవైపు, వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లతో పాటు, 'సర్(SIR' ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలంటూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల నిర్వహణపై అడ్డంకులుగా ఉన్న అనేక అంశాలు తొలగిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత ప్రభుత్వంపై ఉంది.
కాగా, రాష్ట్రంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలు, 123 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్‌డీఏ(NDA) ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఆరు వారాల గడువు మాత్రమే ఉండటంతో, అధికార, ప్రతిపక్ష పార్టీలు క్షణం కూడా వ్యవధిలేకుండా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో మరోసారి ఎన్నికల పండుగ వాతావరణం సంతరించుకోనుంది.