గ్రేటర్ విశాఖపట్నం(Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం జరుగుతున్న రాజకీయ యుద్ధం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి మేయర్ పదవిని 'జనరల్ మహిళ' కేటగిరీకి కేటాయించడంతో, ప్రధాన పార్టీల వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఎలాంటి తప్పు చేయకూడదనే పట్టుదలతో పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో వినిపిస్తోన్న పేర్లు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
అందులోనూ, నందమూరి నటసింహం బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖ ఎంపీ శ్రీభరత్ సతీమణి తేజస్విని(Nandamuri Tejaswini) పేరు తెరపైకి రావడం విశాఖ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. టాలీవుడ్ లెజెండరీ ఫ్యామిలీ నుంచి ఓ కీలక వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి, అది కూడా కీలకమైన జీవీఎంసీ మేయర్ పదవి రేసులోకి అడుగుపెడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీడీపీ అధిష్టానం ఈసారి విశాఖలో తిరుగులేని విజయం సాధించేందుకు ఈ భారీ వ్యూహాన్ని రచిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది.
అయితే, టీడీపీ(TDP)లో ఈ ఒక్క పేరే కాకుండా మరికొన్ని బలమైన ప్రముఖుల సతీమణుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్య పేరుతో పాటు, స్థానికంగా పట్టున్న కొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నిక ఏదైనా సరే, గెలుపు ఒక్కటే లక్ష్యంగా పావులు కదుపుతున్న తరుణంలో, టీడీపీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
మరోవైపు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ(YSRCP) కూడా ఏమాత్రం తీసిపోకుండా గట్టి పోటీకి సిద్ధమవుతోంది. గత అనుభవం, రాజకీయ పరిజ్ఞానం ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరును తెరపైకి తెచ్చి టీడీపీకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మరో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సతీమణి హిమగౌరి పేర్లు కూడా రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల సమీకరణాలను బట్టి అభ్యర్థిని ఖరారు చేయాలని వైసీపీ వ్యూహకర్తలు లెక్కలు వేస్తున్నారు.
విశాఖ చరిత్రను గమనిస్తే, జీవీఎంసీగా రూపాంతరం చెందకముందు, ఆ తర్వాత కలిపి ఇప్పటివరకు ఇద్దరు మహిళలు మాత్రమే మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మూడో మహిళా మేయర్‌గా పీఠం ఎక్కబోయే అదృష్టశీలి ఎవరోనని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రముఖుల కుటుంబాల పేర్లు బరిలో వినిపిస్తుండటంతో, ఈసారి జీవీఎంసీ(GVMC) పోరు సాధారణ ఎన్నికలను తలపించేలా రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధిష్టానాల తుది నిర్ణయం ఎవరి వైపు ఉంటుందో వేచి చూడాలి!