చేతులు కాలాక ఆకులు పట్టుకున్న రోజా..!

admin
Published by Admin — October 28, 2026 in Politics, Andhra
News Image

గత ఐదేళ్లపాటు శాసనసభలోనూ, మంత్రి పదవిలోనూ నిరంతరం వార్తల్లో నిలిచిన వైసీపీ(YCP) సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయ ప్రస్థానం ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక నాయకురాలిగా చక్రం తిప్పి, ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధించిన ఆమెకు ప్రస్తుతం సొంత నియోజకవర్గమైన నగరిలోనే తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.

తాజాగా జరిగిన నగరి(Nagari) మున్సిపల్ ఎన్నికల పరిణామాలు రోజా రాజకీయ భవిష్యత్తుపై పెద్ద దెబ్బగా మారాయి. 40 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో వైసీపీ నుంచి దాఖలైన నామినేషన్లలో సాంకేతిక పొరపాట్లు ఎదురుకావడం, అధికారులు వాటిని తిరస్కరించడంతో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అంతా పూర్తయ్యాక, అధికారాన్ని ప్రత్యర్థికి అప్పగించాక రోజా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం పైనే ఇప్పుడు స్థానికంగా "చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం" అంటే ఇదే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2024 శాసనసభ ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్(Gali Bhanu Prakash) చేతిలో 45,000 పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలైనప్పటి నుంచీ రోజా నియోజకవర్గంలో రక్షణాత్మక ధోరణిలోనే ఉన్నారు. ఒకప్పుడు తిరుగులేని నాయకురాలిగా ఉన్న ఆమె, ఎన్నికల ఓటమి అనంతరం మౌనం వహించాల్సి వచ్చింది. మరోవైపు, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ నియోజకవర్గంలో పట్టు సాధిస్తూ, ప్రభుత్వం తరఫున ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుండటంతో టీడీపీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఈ పరిణామాలన్నింటికీ రోజా(Roja) అనుసరించిన ఏకపక్ష నిర్ణయాలు, సొంత పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేయడంలో విఫలం కావడం, వర్గపోరును నివారించలేకపోవడమే ఆమెకు పెద్ద మైనస్‌గా మారింది. నామినేషన్ల ప్రక్రియలో ప్రాథమిక జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్ల రోజా వర్గం కనీస పోటీని కూడా ఇవ్వలేక వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ(TDP) చూపిన దూకుడు, రోజా సొంత నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ఈ పరాభవం రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ ఉనికికి మరిన్ని సవాళ్లు విసరడం ఖాయంగా కనిపిస్తోంది. మ‌రి ఇకనైనా పార్టీ శ్రేణులను ఏకం చేసుకుని ముందుకెళ్తారో లేక ఈ ఓటములు ఆమెను రాజకీయాకి మరింత దూరం చేస్తాయో వేచి చూడాలి. 

Tags
RK Roja Nagari Politics YSRCP TDP Andhra Pradesh AP Politics Gali Bhanu Prakash Nagari Municipality
Recent Comments
Leave a Comment

Related News