‘అర్జున్ రెడ్డి’ మిస్ చేసుకున్న మరో యంగ్ హీరో

admin
Published by Admin — May 29, 2025 in Movies
News Image

ఒక కథ ఒక హీరో దగ్గర మొదలై.. ఎక్కడెక్కడికో ప్రయాణించడం.. చివరికి ఎవరో ఆ కథను టేకప్ చేయడం.. అది హిట్టయినపుడు ముందు చేయలేకపోయిన హీరో ఫీలవడం.. ఫ్లాప్ అయితే హమ్మయ్య అనుకోవడం మామూలే. ఇలాంటి సినిమాలు వందల సంఖ్యలో ఉంటాయి. ఐతే అలా మిస్సయిన సినిమా జస్ట్ హిట్ అయితే ఓకే కానీ.. అదొక ట్రెండ్ సెట్టర్ అయి, ఇండస్ట్రీ గతినే మార్చేస్తే దాని విషయంలో అసలు హీరో ఎంత బాధపడడతాడో అర్థం చేసుకోవచ్చు. మంచు మనోజ్ పరిస్థితి ఇదే.

టాలీవుడ్లో గత పదేళ్లలో అసలు సిసలైన ట్రెండ్ సెట్టర్ అంటే ‘అర్జున్ రెడ్డి’ అనే చెప్పాలి. ఈ సినిమాను మంచు మనోజే చేయాల్సిందట. కొంత కాలం దర్శకుడు సందీప్ రెడ్డితో అతను ట్రావెల్ చేశాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయినట్లు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం చూశాక అరరే ఈ సినిమాను మిస్సయ్యామే అని ఫీలైనట్లు మనోజ్ తెలిపాడు. సందీప్ రెడ్డి లాంటి దర్శకుడితో పని చేసి ఉంటే తన కెరీరే వేరుగా ఉండేదని అతనన్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండకు ఎలాంటి ఇమేజ్ వచ్చిందో తెలిసిందే. మనోజే కాకుండా శర్వానంద్ సైతం ఈ కథను మిస్సయ్యాడు.

ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోల దగ్గరికి ఈ కథ వెళ్లినట్లు సమాచారం. వీరిలో సందీప్‌తో ఎవరెలా వ్యవహరించారో కానీ.. ఒక హీరో మాత్రం తనను చాలా ఇబ్బంది పెట్టాడని.. కథ ఓకే అని కూడా ఎంతకీ సినిమాను ముందుకు తీసుకెళ్లలేదని.. దీంతో అతడికి తన పేరు గుర్తు పెట్టుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చానని సందీప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నిర్మాత దొరక్క చివరికి ఈ సినిమాను స్వయంగా తనే నిర్మిస్తూ డైరెక్ట్ చేశాడు సందీప్. ఈ సంగతిలా ఉంచితే.. మంచు మనోజ్ తన కెరీర్లో ఒక సూపర్ హిట్, ఓ డిజాస్టర్‌ను మిస్సయినట్లు కూడా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

రామ్ చరణ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటైన ‘రచ్చ’ కథ ముందు తన దగ్గరికే వచ్చిందని, కానీ అది చేయడం కుదరలేదని.. కానీ తన మిత్రుడే అయిన రామ్ చరణ్ ఆ సినిమా చేసి హిట్టు కొట్టాడు కాబట్టి హ్యాపీ అని మనోజ్ తెలిపాడు. ఇక నాగచైతన్య కెరీర్లో పెద్ద డిజాస్టర్ అయిన ‘ఆటోనగర్ సూర్య’ తాను చేయాల్సిన సినిమానే అని, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని మనోజ్ వెల్లడించాడు.

Tags
Arjun Reddy Movie Director Sandeep Reddy Vanga
Recent Comments
Leave a Comment

Related News