తెలుగులో ఎన్నో భారీ చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ఎన్నో డిజాస్టర్లు ఉన్నాయి. కానీ వాటిని మించి ఓ మిడ్ రేంజ్ సినిమాను ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా ఇటీవల అందరూ పేర్కొంటుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చిత్రమే.. జాక్. ఏకంగా రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రమిది. ఆ వసూళ్లు చూసేనేమో.. దీని మీద భారీ బడ్జెట్ పెట్టేశారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. సిద్ధుకు కూడా ముందు అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ పారితోషకమే ఇచ్చారు.
ఎందుకంటే ఈ సినిమా మొదలైంది ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కాకముందు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోవడంతో పెరిగిన మార్కెట్‌కు అనుగుణంగా సిద్ధుకు డబుల్ డిజిట్ ఫిగర్లో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలా ఇవ్వడం సమంజసం కూడా. ఇక మేకింగ్ బాగా ఆలస్యం కావడం.. భారీ లొకేషన్లలో సినిమా తీయడంతో బడ్జెట్ తడిసిమోపెడైంది. వడ్డీలు అన్నీ కలుపుకుంటే రూ.45 కోట్లకు బడ్జెట్ చేరినట్లు సమాచారం.
నిర్మాత డెఫిషిట్లోనే సినిమాను రిలీజ్ చేశారు. అయినా బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. వాళ్లు పెట్టిన పెట్టుబడిలో పదో వంతు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఇటీవల ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన సునీల్ నారంగ్ మాటలు చూస్తే ‘జాక్’ ఎంత పెద్ద డిజాస్టరో అర్థమవుతోంది. ‘జాక్’ సినిమా పరిస్థితి చూశాక ఇంకేముంది అంటూ.. అంతకంటే వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇంకోటి లేదన్నట్లు మాట్లాడాడు సునీల్. అంతకంటే ముందు తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ఇన్‌డైరెక్ట్‌గా రూ.2 కోట్ల షేర్ దాటలేదంటూ ‘జాక్’ గురించే విమర్శ చేశాడు.
ఇంకా టాలీవుడ్లో అంతర్గతంగా ‘జాక్’ ఎంత పెద్ద డిజాస్టర్ అన్నదానిపై చాలా చర్చే నడిచింది. టాలీవుడ్లో ఫ్లాపులు, డిజాస్టర్లు కొత్త కాదు కానీ.. ఒక భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నుంచి వచ్చిన సినిమా పెట్టుబడిలో ఐదో వంతు కూడా థియేటర్ల నుంచి రాకపోవడం అంటే అది ఏ స్థాయిలో పెట్టుబడిదారులను ముంచేసిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పెట్టుబడి-రాబడి కోణంలో ‘జాక్’ను టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా పేర్కొంటున్నారు.