గతంలో ఓ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం ఎంతటి కాంట్రవర్సీ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అవడం.. బన్నీ అరెస్ట్ అవ్వడం తెలిసిందే. సీఎం పేరును మరిచిపోవడం వల్లే బన్నీని అరెస్ట్ చేయించారని కూడా ప్రచారం జరిగింది. అయితే నాడు బన్నీ పేరు మర్చిపోయినట్లే నేడు బాలయ్య కూడా మర్చిపోయారు.
అయితే ఈసారి సీఎం కాదు డిప్యూటీ సీఎం పేరును నటసింహం మర్చిపోయి నీళ్లు నమిలారు. తాజాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని హైటెక్స్ లో అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ అవార్డు ఫంక్షన్ కు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం భారీ ఎత్తున హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేశారు.
అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. చాలా సేపు నీళ్లు నములుకున్న అనంతరం పేరు గుర్తుకు రావడంతో ఆయనకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
ఆ సమయంలో బాలయ్య వెనుక ఉన్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకోవడం మరొక హైలెట్ గా నిలిచింది. ఇక గతంలో బన్నీ సీఎం పేరు మర్చిపోతే అంత రచ్చ జరిగింది. ఇప్పుడు బాలయ్య డిప్యూటీ సీఎం పేరు మర్చిపోతే ఏం జరుగుతోందో అని నెటిజన్లు సరదాగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.