మహానాడు వేడుకలకు బాలకృష్ణ ఎందుకు హాజరు కాలేదు?

admin
Published by Admin — May 29, 2025 in Andhra
News Image

ఈ ఏడాది మ‌హానాడు వేడుకలను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైన మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో సహా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల న‌లుమూల‌ల నుంచి టీడీపీ అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివస్తున్నారు. రెండో రోజు బుధవారం ప్రతినిధుల సమావేశాలు ముగిశాయి. చివరి రోజు గురువారం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో దాదాపు 5 లక్షల మంది పాల్గొంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే మహానాడులో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం అనేక చర్చలకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ సీనియర్ ఎమ్మెల్యే. పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు. అటువంటి బాలయ్య మహానాడుకు దూరంగా ఉండటానికి కారణం ఏంటనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

అయితే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే మహానాడుకు బాలయ్య హాజరు కాలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ `అఖండ 2` మూవీ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `సింహ`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో అఖండ 2 పై అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి.

దసరా బరిలో ఈ సినిమాను నిలిపేందుకు చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అఖండ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ సమావేశాల‌కు బాలయ్య హాజరుకాలేదు. తాజాగా మహానాడుకు దూరంగా ఉండడానికి కారణం కూడా అదే అని అంటున్నారు. అయితే నేడు జరగబోయే భారీ బహిరంగ సభకు బాలకృష్ణ హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Tags
Andhra Pradesh AP News ap politics Balakrishna
Recent Comments
Leave a Comment

Related News