ఏపీలో విపక్ష వైసీపీ కి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం బాగా అలవాటైపోయింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేసిన `తల్లికి వందనం` పథకం విషయంలోనూ వైసీపీ తల దూర్చింది. తల్లికి వందనం నగదు రూ. 15000 కాగా.. అందులో రూ. 13000 మాత్రమే తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన రూ. 2000 పాఠశాల అభివృద్ధికి కేటాయించింది. ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ.. వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తోంది.
ఆ కట్ చేసిన రెండు వేల రూపాయలు `ఎల్` టాక్స్ పేరుతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది. తల్లికి వందనం డబ్బుల్లో తల్లుల ఖాతాల్లో రూ. 13000 పడితే.. లోకేష్ ఖాతాలో రూ. 2000 పడుతున్నాయని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన లోకేష్.. వైసీపీకి మరియు ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి సవాల్ విసిరారు. తల్లికి వందనం పథకంలో రూ. 2 వేలు తన అకౌంట్ లో పడుతున్నాయని 24 గంటల్లో వైసీపీ నిరూపించాలి.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు.
ఎప్పటిలాగానే ఈసారి కూడా వైసీపీ విమర్శలే తప్ప ఆధారాలు చూపేందుకు ముందుకు రాలేదు. కానీ లోకేష్ మాత్రం వైసీపీకి గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి లేదంటే తప్పు ఒప్పుకోవాలి.. అలా కాని పక్షంలో చట్టపరంగా వైసీపీపై చర్యలు తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. తాజాగా లోకేష్ ఇచ్చిన డెడ్‌లైన్ కూడా ముగిసింది.
ఈ నేపథ్యంలోనే గెట్ రెడీ వైసీపీ అంటూ నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. `బురద చల్లడం పారిపోయి ప్యాలెస్‌లో దాక్కోవడం వైఎస్ జగన్ గారికి అలవాటు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. అందుకే మిమ్మల్ని ఫేకు జగన్ అనేది. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండి` అంటూ లోకేష్ తాజాగా వార్నింగ్ ఇవ్వడంతో వైసీపీ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.