హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణతో పిఠాపురం ఎమ్మెల్యే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ పోరుకు సిద్ధం అయ్యారు. దసరా సెలవులను క్యాష్ చేసుకునేందుకు మూడు నెలల ముందే సెప్టెంబర్ 25ను విడుదల తేదీగా లాక్ చేసుకుంది `అఖండ 2`. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న అఖండ 2కు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. అయితే ఇప్పుడు అఖండ 2కు పోటీగా పవన్ కళ్యాణ్ `ఓజీ` కూడా రాబోతుండడం సినీప్రియుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు కాగా.. ప్రియాంక మోహన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఓజీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజాగా ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. దీంతో దసరా బరిలో కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడటం ఖాయమైంది. మరి ఈ పోరులో నెగ్గేదెవరు? తగ్గేదెవరు? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా బాలయ్యతో పవన్ బాక్సాఫీస్ ఫైట్ కి దిగే అవకాశాలు లేనే లేవు. అయిన కూడా దసరా బరిలో ఓజీని దింపుతున్నారంటే.. బహుశా అఖండ 2 సైడ్ అవుతుందనే సూచనలు వచ్చి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.