పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే పవర్ ఫుల్ విలన్ ఉండాల్సిందే. ఆయన్నుంచి తర్వాత రాబోతున్న ‘హరిహర వీరమల్లు’లో ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి చిత్రం ‘ఓజీ’లో మరో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్ర పోషించాడు. ఐతే వరుసగా ఇద్దరు బాలీవుడ్ విలన్లతో పని చేశాక.. పవన్ ఓ తమిళ నటుడిని ఢీకొట్టబోతున్నట్లు సమాచారం. ఆ నటుడు ఎవరో కాదు.. పార్తీబన్.
‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాల షూట్ పూర్తి చేసిన పవన్.. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి అడుగు పెట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ చిత్రం మళ్లీ చిత్రీకరణను మొదలుపెట్టుకుంది. ఈ చిత్రంలో పార్తీబన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు బ్రేక్ పడడానికి ముందు అనుకున్న విలన్ వేరు. కానీ అప్పుడు రీమేక్ కథతో జరుగుతున్న సినిమా కాస్తా ఇప్పుడు మారిపోయింది. ఒరిజినల్ స్టోరీతోనే ఈ సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్.
అది, ఇది పోలీస్ కథే కావడంతో ముందు తీసిన సీన్లను ఇందుకోసం వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. కథ మారగానే విలన్ని కూడా మార్చేశారట. 90వ దశకం నుంచి తమిళ సినిమాలను ఫాలో అవుతున్న వారికి పార్తీబన్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగానే కాక, దర్శకుడిగానూ ఆయన తనదైన ముద్ర వేశారు.
టిపికల్ టైమింగ్‌తో ఆయన నటన సాగుతుంది. ప్రతినాయక పాత్రలు చేసినా.. అందులో స్టైల్, ఫన్ ఉంటాయి. తెలుగులోకి ‘నేనూ రౌడీనే’గా అనువాదం అయిన ‘నానుమ్ రౌడీదా’ చిత్రంలో ఆయన విలనీ అదరగొట్టాడు. మరి పవన్ సినిమాలో ఆయన విలనీని ఎలా పండిస్తాడన్నది ఆసక్తికరం. హరీష్ సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి.. పార్తీబన్ నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ ఆశించవచ్చు.