ఈ రోజుల్లో సినిమా మొదలైనపుడే ఘనంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నారు కానీ.. తీరా చూస్తే ఆ డేట్‌కు సినిమాను రెడీ చేయలేక వాయిదా వేసేస్తున్నారు. గతంలో ఇలా డేట్ మారిస్తే పెద్ద విషయంలా ఉండేది. దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగానూ భావించేవారు. కానీ కరోనా తర్వాత ఆ ఫీలింగ్ పోయింది. ఒక సినిమాకు పలుమార్లు డేట్ మార్చడం మామూలైపోయింది. సినిమా మొదలైనపుడు చెప్పిన డేట్ కు వచ్చే వాళ్లు అరుదనే చెప్పాలి.
ఐతే ఉన్నంతలో నేచురల్ స్టార్ ఈ విషయంలో కొంచెం పక్కాగా ఉంటాడు. తన చివరి నాలుగు చిత్రాలు హిట్-3, సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా చెప్పిన డేట్‌కే వచ్చాయి. కానీ తన కొత్త సినిమా మాత్రం డేట్ తప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రమే.. ది ప్యారడైజ్.
కొన్ని నెలల కిందటే ప్రి టీజర్‌తో పలకరించింది ‘ది ప్యారడైజ్’. అందులోనే వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’కి సైతం అదే డేట్ ప్రకటించగా.. చరణ్, నాని మధ్య క్లాష్ ఉంటుందా అని అంతా ఆశ్చర్యపోయారు. ‘హిట్-3’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. తాము అయితే పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నామని.. ఆ డేట్‌కు రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పాడు నాని. తీరా ఆ సమయానికి తమ రెండు చిత్రాల్లో ఏదైనా తప్పుకుంటుందేమో చూడాలి, రెండూ రిలీజైనా పర్వాలేదు అన్నాడు నాని. ఐతే అతను ఆ మాటలు చెప్పే సమయానికి అనుకున్న ప్లానింగ్ ప్రకారం ‘ది ప్యారడైజ్’ మొదలు కావట్లేదు.
ఈపాటికే సెట్స్ మీదికి వెళ్లాల్సిన ‘ది ప్యారడైజ్’ వచ్చే నెలలో కూడా చిత్రీకరణ మొదలుపెట్టుకుంటుందా అన్నది సందేహం అంటున్నారు. ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యమే అందుక్కారణం. ఇంకా స్క్రిప్టుకు కొంత మెరుగులు దిద్దుతుండగా.. ఈ సినిమాకు వేయాల్సిన భారీ సెట్టింగ్స్‌కు కూడా టైం పడుతోందట. షూట్ మొదలు కావడంలోనే ఆలస్యం జరుగుతుండడంతో చెప్పిన డేట్‌కు సినిమాను రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. ఇది నాని కెరీర్లోనే భారీ సినిమా. కాబట్టి ఇంకో ఎనిమిది నెలల్లో రిలీజ్ అంటే కష్టమే. కాబట్టి వేసవి చివరికి వాయిదా పడడం ఖాయమంటున్నారు. మరోవైపు ‘పెద్ది’ సినిమా పక్కా షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణ జరుపుకుంటుండడంతో మార్చి చివరి వారంలో ఆ సినిమా రిలీజ్ కావడం ఖాయమని అంటున్నారు.