సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు.. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయనను గుంటూరు జిల్లా జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో ఆయన బయటకు వచ్చారు. ఈ సమయంలో సాక్షి మీడియా ప్రతినిధులు సహా పలువురు జర్నలిస్టులు ఆయనను కలుసుకున్నారు. ఈ సమయంలో ఒకరిద్దరు కొమ్మినేని తరఫు బంధువులు కూడా జైలు వద్దకు చేరుకుని ఆయనను వెంటబెట్టుకుని తీసుకువె ళ్లారు. చేతిలో ఓ సంచీతో బయటకు వచ్చిన కొమ్మినేనిని పలువురు జర్నలిస్టులు చుట్టుముట్టారు.
అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక.. తొలుత ఆయన నేరుగా తాడేపల్లికి వెళ్లారు. అక్కడ వైసీపీ అధినేత, సాక్షి మీడియా చైర్ పర్సన్ భారతి రెడ్డిలను కొమ్మినేని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తనతో ఎలా వ్యవహరించారనే విషయాలను జగన్‌కు ఆయన చెప్పినట్టు తెలిసింది. అయితే.. పార్టీ పరంగా, మీడియా పరంగా మీకు అందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కొమ్మినేని తాను తప్పు చేయలేదని.. ఎవరైనా తప్పు చేసినా ఖండిస్తానని జగన్‌కు చెప్పుకొచ్చినట్టు సమాచారం.
ఈ నెల 6న సాక్షి మీడియాలో అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎనలిస్టు కృష్ణంరాజు తీవ్ర అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది వివాదంగా మారి.. మహిళలు ఆగ్రహానికి లోనై.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో తుళ్లూరుకు చెందిన మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో అప్పటి చర్చకు యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనిని ఏ2గా పేర్కొన్నారు. అనంతరం తెల్లవారి ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మంగళగిరి స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
అయితే.. సుప్రీంకోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛ, జర్నలిజం స్వేచ్ఛల కోణంలోను, యాంకర్‌గా కొమ్మినేని నవ్వితే అరెస్టు చేస్తారా అని పేర్కొంటూ.. ఆయనకు బెయిల్ ఇవ్వాలని స్థానిక కోర్టును ఆదేశించింది. అయితే.. బెయిల్ షరతులకు అనుగుణంగా కొమ్మినేని వ్యవహరించాలని తీర్పు చెప్పింది. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు కొమ్మినేనికి బెయిల్ ఇచ్చింది. ఇకపై.. ఎలాంటి దుర్భాషలకు తావులేకుండా వ్యవహరించాలని.. వివాదాస్పద చర్చలు చేపట్టవద్దని పేర్కొంది. దేశం విడిచి వెళ్లరాదని తేల్చి చెప్పింది.