ఏపీ సీఎం చంద్రబాబు తరచుగా వినియోగించే హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో హెలికాప్టర్‌ను తిరుపతిలోనే వదిలేశారు. అయితే.. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లోనూ.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. తరచుగా ఎందుకు మొరాయిస్తోంది? అసలు ఏం జరిగింది? దీనిని భవిష్యత్తులో వినియోగించాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం సంబంధిత సంస్థను సమాచారం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరణ కోరుతూ హెలికాప్టర్ సంస్థ జీఎంఆర్‌కు లేఖ రాశారు.
సీఎం చంద్రబాబు 4వ సారి అధికారంలోకి వచ్చాక.. జీఎంఆర్ సంస్థకుచెందిన హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. అయితే.. తరచుగా ఈ హెలికాప్టర్ సమస్యలు పెడుతోంది. ఇటీవల కాలంలో లోహ విహంగాలు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. దీంతో ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త హెలికాప్టర్‌ను కొనుగో లు చేయాలని నిర్ణయించారు. దీనికి సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేయాల్సి ఉండడంతో కొంత వెనక్కి తగ్గారు. ఇదిలావుంటే.. తాజాగా కూడా ఈ హెలికాప్టర్ మరోసారి నిలిచిపోయింది. దీంతో డీజీపీ ఆరా తీశారు.
తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఢిల్లీ నుంచి విమానంలో ఆదివారం సాయంత్రం గన్నవరం వచ్చిన ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం.. సోమవారం ఉదయం తిరుపతికివెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్‌ను ఆయనకు కేటాయించారు. అమరావతి నుంచి ఆ హెలికాప్టర్‌లోనే కేంద్ర మంత్రి తిరుపతి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం.. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు ఇదే హెలికాప్టర్‌లో వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేశారు.
అయితే, తిరుపతిలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం బయటపడింది. దీంతో సదరు పర్యటనను కేంద్ర మంత్రి విరమించుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఆ హెలికాప్టర్ పనితీరు, లోపాలు.. వంటి వాటిపై ప్రభుత్వం వివరణ కోరింది. అనంతరం.. సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్‌నుకొనుగోలు చేసేఅవకాశం ఉందని తెలుస్తోంది.