ప్రముఖ నటి రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. పూణెకు చెందిన రేణు దేశాయ్ `బద్రి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ సమయంలోనే తన కో-స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహజీవనం చేశాక ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే అకీరా నందన్ కు జన్మనిచ్చిన పవన్-రేణూలకు.. ఆ తర్వాత ఆద్య పుట్టింది. అయితే వ్యక్తిగత విభేదాలతో 2011లో రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ మరొక వివాహం చేసుకున్నారు.
అప్పటినుంచి రేణు దేశాయ్ పిల్లల్ని చూసుకుంటూ ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. 2018లో రేణు రెండో వివాహానికి సిద్ధమైంది. కానీ నిశ్చితార్థం తర్వాత ఆమె వెనకడుగు వేసింది. అయితే తాజాగా రెండో పెళ్లిపై రేణు గుడ్ న్యూస్ పంచుకుంది. తాను రెండో పెళ్ళికి రెడీగా ఉన్నానంటూ పేర్కొంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ మాట్లాడుతూ.. రెండో వివాహం చేసుకోవడానికి మానసికంగా నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలోనూ ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, తోడు కావాలని కోరుకుంటున్నాను.
నువ్వు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటావో వారినే పెళ్లి చేసుకో మమ్మీ అని అకీరా, ఆద్య చెప్పారు. వారి ప్రోత్సాహం నా మనసును తాకింది. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ, అందుకు మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలి. ఇప్పుడు నా పూర్తి సమయం నా పిల్లల పెంపకానికే కేటాయిస్తున్నాను. నేనూ దూరమైతే వాళ్లు ఒంటరితనంతో బాధపడతారు. కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిందంటే వాళ్లు తల్లిదండ్రులపై ఆధారపడటం మానేస్తారు. నాకూ పూర్తిగా స్వేచ్ఛ వస్తుంది, అప్పుడు నా జీవితాన్ని కొత్తగా మొదలుపెడతాను` అంటూ చెప్పుకొచ్చింది. రేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రెండో పెళ్లి విషయంలో రేణు ఆలోచన విధానం ఎంతో ఉత్తమంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.