మొండికి జగమొండికి మధ్య పంచాయితీ వస్తే ఎలా ఉంటుంది? అందులో మొండి ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటే.. జగమొండి ప్రపంచ కుబేరుడు. మొన్నటివరకు ఇద్దరు స్నేహితులు. ఎంతలా అంటే.. జగమొండి కొడుకును మొండి స్వయంగా తన ఆఫీసులో ఆడుకోనివ్వటమే కాదు.. తనతో పాటు సరదాగా తాను ప్రయాణించే చాపర్ లో తీసుకెళ్లేవాడు. అలాంటి ఇద్దరు జిగిరీ దోసతుల మధ్య మొదలైన పంచాయితీ ఇప్పుడు అగ్రరాజ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే వరకు వెళ్లింది.
‘వన్ బిగ్ బ్యయూటిఫుల్ బిల్’ ఇష్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు మధ్య వివాదాలు ఉండటం.. అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కొత్త పార్టీ పెట్టేందుకు మస్క్ నిర్ణయం తీసుకొని.. తాజాగా అధికారికంగా ప్రకటన చేసేశారు. ఈ బిల్లు విషయంలో ట్రంప్ తో బహిరంగంగా వ్యతిరేకించిన మస్క్.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
తాను వ్యతిరేకించే ఈ బ్యూటీఫుల్ బిల్ ను ట్రంప్ సర్కారు తీసుకొస్తే తాను కొత్త పార్టీ పెడతానని గతంలోనే ప్రకటించిన మస్క్.. అన్నంత పని చేశాడు. కొత్త పార్టీ పేరును ప్రకటించాడు. తన కొత్త పార్టీ పేరు ‘అమెరికా పార్టీగా ప్రకటించిన ఆయన.. తన నిర్ణయంతో అమెరికా రాజకీయాల్లో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. అదే సమయంలో మొండి తాను పట్టుపట్టినట్లుగా బ్యూటిపుల్ బిల్లును చట్టసభల ఆమోదాన్ని పొందేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. వైట్ హౌస్ లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్ పై సంతకం చేశారు. దీంతో.. ఈ బిల్లు అమల్లోకి వచ్చినట్లైంది.
బిల్లుపై ట్రంప్ సంతకం పెట్టినంతనే.. ట్రంప్ తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు రూపంలో వెల్లడించారు. ‘‘మన దేశాన్ని నష్టాలలోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి.. ఇవన్నీ చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావలసిన కొత్త రాజకీయ పార్టీ’’ అంటూ మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ బిల్లు చట్టంగా మారిన నేపథ్యంలో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు 1.2 ట్రిలియన్ డాలర్ల విలువైన మెడిక్ ఎయిడ్.. ఆహార కూపన్ల కోతకు అవకాశం ఉంది. ఈ చట్టం కారణంగా వలస సేవల విభాగానికి మరిన్ని నిధులు అందనుంది. పదేళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీరుస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బీమా రక్షణ కవచం నుంచి 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరం కానున్నారు.