ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా హైదరాబాద్ లో అర్ధరాత్రి కన్నుమూశారు. వయోభారంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. శివ శక్తి దత్తా సినిమా రంగంలో ప్రముఖ గేయ రచయితగా, స్క్రీన్ రైటర్ గా మరియు కవిగా గుర్తింపు పొందారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ కు శివశక్తి దత్తా స్వయానా సోదరుడు.
డైరెక్టర్ కావాలనే ఆశతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శివ శక్తి దత్తాను ఆయనలోని కవి హృదయం రచన వైపు అడుగుల వేసేలా చేసింది. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. శివ శక్తి దత్తా పాటలకు వాడే పదబంధాలు, భావప్రకటనలు చాలా గంభీరంగా ఉంటాయి. నేటి తరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో `సైరా నరసింహారెడ్డి`, `బాహుబలి సిరీస్`, `ఆర్ఆర్ఆర్` వంటి చిత్రాలకు పాటలు రాశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న `విశ్వంభర` చిత్రానికీ ఆయన గీతాల రచన చేసినట్టు సమాచారం అందుతోంది.
అలాగే శివ శక్తి దత్తా మంచి పెయింటర్ కూడా. చరిత్ర, దేవతలు, పురాణాలపై ఆధారంగా ఆయన గీసే చిత్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇక శివ శక్తి దత్తా కుటుంబం మొత్తం ఇండస్ట్రీలోనే ఉన్నారు. తనయుడు కీరవాణి సంగీత దర్శకుడిగా, తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ రచయిత మరియు దర్శకుడిగా, తమ్ముడి కుమారుడు రాజమౌళి దర్శకధీరుడిగా వెలుగొందుతున్నారు.