కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి వ్యవహారం ఏపీలో రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఇంట్లో వస్తువులు, కారు ధ్వసం చేశారు. అయితే, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై ప్రశాంతి రెడ్డి స్పందించారు.
ఆ దాడి ఘటనతో తమకు సంబంధం లేదని ప్రశాంతి రెడ్డి ఖండించారు. దాడులు చేసే సంస్కృతి తమది కాదని అన్నారు. గతంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఎంతోమందిని ఇబ్బంది పెట్టారని, వారంతా తీవ్రమైన బాధలు అనుభవించారని గుర్తు చేశారు. వారిలో ఎవరో ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయినా, ప్రసన్నకుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తమ ఇంట్లోని మహిళలకు వైసీపీ నేతలు చూపించగలరా అని ప్రశ్నించారు. మహిళపై ఒక మాజీ ఎమ్మెల్యే ఆ తరహా వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఈ వ్యవహారాన్ని జగన్ తీవ్రంగా పరిగణించి ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు.