మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `రంగస్థలం`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రంగస్థలంలో రామ్ చరణ్ తో పాటు మరో హీరో నటించాడు. ఆయనే ఆది పినిశెట్టి. చిట్టిబాబు(రామ్ చరణ్) అన్నయ్య కుమారబాబు పాత్రలో ఆది కనిపించాడు. నిడివి తక్కువ అయినప్పటికీ కథలో అత్యంత ముఖ్యమైన క్యారెక్టర్ అది. అయితే ఆ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కే సాగర్. ఎస్, మీరు విన్నది నిజమే.
తన రాబోయే చిత్రం `ది 100` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆర్కే సాగర్ ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేశాడు. `మిస్టర్ పర్ఫెక్ట్` సినిమాలో సెకండ్ లీడ్ అని చెప్పి తనతో సైడ్ క్యారెక్టర్ చేయించారని.. దాని వల్ల తాను చాలా ఎఫెక్ట్ అయ్యానని, ఆ తర్వాత చేస్తే హీరోగా మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యానని ఆర్కే సాగర్ పేర్కొన్నారు. అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బ్రదర్ క్యారెక్టర్ కు సుకుమార్ గారు ఫస్ట్ తననే కాంటాక్ట్ అయ్యారని సాగర్ వెల్లడించారు
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్సిడెంట్ గుర్తొచ్చి నేను నో చెప్పాను, నెక్స్ట్ ఆది పినిశెట్టిని సంప్రదించగా.. ఆయన కూడా నో చెప్పారు. అది తెలిసి మళ్లీ నేనే ఆ క్యారెక్టర్ చేద్దామని సుకుమార్ గారిని కంటాక్ట్ అయ్యాను. ఇంకోవైపు నా మాదిరిగానే మొదట నో చెప్పిన ఆది పినిశెట్టి కూడా తర్వాత ఓకే చెప్పారు. దాంతో ఆది గారినే ఫైనల్ చేశారని ఆర్కే నాయుడు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి రంగస్థలంలో గోల్డెన్ ఛాన్స్ ను సాగర్ చేతులారా మిస్ చేసుకున్నాడు.