ఏపీ సీఎం చంద్రబాబు మంత్రం.. పెట్టుబడి దారుల్లో భరోసా కల్పిస్తోంది. ఏపీకి వచ్చేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. తాజాగా మంగళవారం మంత్రి నారా లోకేష్ బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులు పెట్టాలని కోరుతూ.. పారిశ్రామిక, ఐటీ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు విజన్‌ను వారికి వివరించారు. సాధారణంగా ఇలా పిలుపుని వ్వడం.. పెట్టుబడులను ఆహ్వానించడం కామనే.
ఆ తర్వాత కొన్నాళ్లకు కానీ.. పెట్టుబడి దారులు ముందుకు వచ్చే అవకాశం లేదు. కానీ, చిత్రంగా బెంగ ళూరులో నారా లోకేష్ ఇలా పిలుపు ఇవ్వగానే.. అలా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక, ఐటీ రంగా లకు చెందిన ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. `సత్వా` గ్రూపు ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపిన కొద్దిగంటల్లోనే ప్రముఖ రియాలిటీ సంస్థ `సత్వ గ్రూపు` ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
సత్వా గ్రూపు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ డెవలప్ మెంట్ క్యాంపస్ ను రూ.1500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అధునాతన సాంకేతికతలతో దూసుకెళ్తున్న విశాఖ మహానగర అభివృద్ధిలో సత్వా క్వాంపస్ మైలురాయి కానుందని మంత్రి తెలిపారు.
అదేవిధంగా `ఏఎన్ ఎస్ ఆర్` సంస్థ కూడా విశాఖలో 10వేల ఉద్యోగాలు కల్పించే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుంది. నారా లోకేష్ చర్చల ద్వారా ఒకే రోజు విశాఖపట్నంలో 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించే రెండు భారీ ప్రాజెక్టులను రప్పించడం గమనార్హం. అయితే.. ఇదంతా చంద్రబాబు బ్రాండ్ ఇమేజేనని నారా లోకేష్ పేర్కొన్నారు.