వైసీపీ నాయకులకు ఏమాత్రం భయం కానీ ప్రజల పట్ల బాధ్యత కానీ లేకుండా పోతోందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రప్ప రప్ప డైలాగులతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శల పాలైన విషయం తెలిసిందే. రప్పా రప్పా డైలాగులను ఆయన సమర్థించారు. పైగా తప్పు లేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో వైసిపి పై ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇక తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరుసకు వదిన అయ్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఆవిడ ఎమ్మెల్యే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి దురుసుగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కూటమిలోని నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్లపురెడ్డి పై కేసు పెట్టాలని డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రశాంతి రెడ్డి కూడా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా తీవ్రంగా స్పందించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వ్యాఖ్యలను ఊరుకునేది లేదని ఖచ్చితంగా చర్యలు తీసుకోక తప్పదని ఆమె తేల్చి చెప్పారు. ఇక టిడిపి లోని మహిళా మంత్రుల నుంచి ఇతర మంత్రుల వరకు ప్రసన్నకుమార్ పై నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ పైన తీవ్ర విమర్శలు గుర్తించారు. `తల్లిని చెల్లిని వదిలేసిన జగన్ కు ఇలాంటి వారే అండగా ఉన్నారం`టూ ఎద్దవా చేశారు. ఇక జనసేన నాయకులు కూడా వైసీపీపై విమర్శలతో రుచుకుపడ్డారు. తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే కేసు పెట్టి తక్షణమే జైలుకు పంపించాలని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ కళ్యాణ్ పొగరుబోతులంటూ వైసీపీ నాయకులపై దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. ఇలా వ్యక్తిగత కక్షలు.. వ్యక్తిగత అంశాలను రాజకీయాలకు జోడిస్తూ వైసిపి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీతో పాటు పార్టీ అధినేతకు కూడా తీవ్ర ఇబ్బందికర పరిణామంగానే మారిందని చెప్పాలి. నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే జగన్ కు ఎంతో కొంత పరువు దక్కి ఉండేది. కానీ చూస్తూ కూర్చోవడం, నాలుగు రోజులు పోయిన తర్వాత వాటిని సమర్ధించటం ఆయనకు అలవాటుగా మారింది.
నిజానికి మహిళా పక్షపాతిగా, మహిళలకు మేలు చేశామని చెప్పుకునే నాయకుడిగా జగన్ ఇలాంటి వాటిని సమర్థించడం ఎంతవరకు సమంజసం అనేది ఆయన ఆలోచన చేసుకోవాలి. నల్లపురెడ్డి వివాదం పెరిగి పెద్దదయ్యే వరకు వేచి చూసి, అసలు తనకు ఏమీ పట్టదు అన్నట్టుగా వ్యవహరించడం పట్ల సభ్య సమాజం తిట్టిపోస్తోందని గుర్తించలేకపోతుండడం మరో దారుణ విషయం. ఇప్పటికైనా జగన్ నల్లపురెడ్డి తో పాటు తాను కూడా మహిళలకు క్షమాపణ చెబితే ఈ వివాదం అంతటితో ముగుస్తుంది. లేకపోతే భవిష్యత్తులో ఇవన్నీ పెను శాపాలుగా మారి మరింతగా పార్టీతో పాటు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.