వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా పర్యటన మరోసారి వివాదంగా మారింది. జగన్ వస్తున్నారంటేనే.. అధికారులు, పోలీసులు బిక్కచచ్చిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో.. కార్యకర్తలు, నాయకులు ఎలా రెచ్చిపోతారోనని.. బితుకుబితుకు మంటున్నారు. ఈ క్రమంలోనే ఆంక్షలు పెడుతున్నారు. అయినా.. ఆ ఆంక్షలేమీ లెక్కచేయకుండానే.. కార్యకర్తలు, నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా బంగారు పాళ్యంలో పర్యటించడానికి జగన్ రాకముందే.. కార్యకర్తలు హంగామా సృష్టించారు.
మామిడి మార్కెట్ యార్డులోకి జగన్ రాకముందే..కార్యకర్తలు వందల సంఖ్యలో దూసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులను సైతం తోసేసి, గేట్లు కూడా విరగ్గొట్టి.. ముందుకు దూసుకుపోయారు. ఈ ఘటనల్లో ఓ పోలీసు సహా.. మహిళ తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా పలువురు కార్యకర్తలు కూడా ఈతోపులాటలో గాయపడ్డారు. వాస్తవానికి పోలీసులు ఆంక్షలు విధించారు. హెలీప్యాడ్‌వద్దకు 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ.. వందలాదిమంది హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
అదేవిధంగా ర్యాలీలు, ప్రదర్శనలకు అస్సలు అనుమతి లేదని ఎస్పీనే చెప్పారు. అయినా.. కార్యకర్తలు వందలాది బైకులు, కార్లలో హారన్లు మోగిస్తూ..సైలెన్సర్లు తీసేసి రహదారులపై ఇష్టానుసారంగా వ్యవహరిం చారు. దీంతో సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక, ప్రధాన కార్యక్రమం జరిగే మార్కెట్ యార్డు వద్దకు కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, ఇక్కడకు సుమారు లక్ష మంది చేరుకోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది.
జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ..
హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా వస్తున్న జగన్‌ను ఎస్పీ మణికంట చందోలు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే.. జగన్ తన కాన్వాయ్‌ను నిలిపేందుకు ససేమిరా అన్నారు. అంతేకాదు.. కారులోపల కూర్చొని వెళ్లాలని కోరినా ఆయన వినిపించుకోకుండా.. ఫుట్ బోర్డుపైనే నిలబడి ముందుకు సాగారు. ఈ పరిణామాలతో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.