ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెత్తను ఊడ్చినట్టు.. నేరస్తులను కూడా ఊడ్చేస్తానని హెచ్చరించారు. ``ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం. ఊడ్చి అవతల పడేస్తాం. డస్ట్ బిన్నుల్లో కుక్కుతాం. అలా నే.. రాష్ట్రంలో రాజకీయ నేరస్తులుగా చెలామణి అవుతున్న చెత్త కూడా పోగుపడింది. దానిని కూడా ఊడ్చేస్తా. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. ప్రజలే వారిని పక్కన పెట్టారు. ఇప్పుడు మేం ఉపేక్షిస్తే.. అది తప్పవుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పునకు అర్ధమే ఉండదు. అందుకే.. రాజకీయ చెత్తను నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నాం.`` అని వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని కపిలేశ్వరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. కొద్ది సేపు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వమించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ సహా వైసీపీ నాయకులపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ``ఇల్లుబాగుండాలంటే.. చెత్త ఉండకూడదు. ఔనా.. కాదా.. అలానే.. రాష్ట్రం బాగుండాలంటే.. రాజకీయ చెత్త ఉండకూడదు. మీరు ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుగానే నేను రాజకీయ చెత్తను శుభ్రం చేస్తా`` అని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నేరచరిత్ర ఉన్న వారిపై ఉక్కుపాదం మోపామని చంద్రబాబు చెప్పారు. గతంలో ప్రజలు తమ భూములు ఎవరు లాక్కుంటారో.. ఎప్పుడుతమకు నిలువ నీడకూడా లేకుండా పోతుందో అని బెంగ పెట్టుకునేవారు. కానీ, కూటమి ప్రభుత్వంవచ్చాక.. ఆ ఇబ్బందులు తప్పించాం. ప్రజల భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఉపేక్షించకుండా.. కేసులు పెడుతున్నాం. ఫ్యాక్షనిజం, ముఠా కక్షలు, మత ఘర్షణలకు తావు లేకుండా ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నాం. నేరస్థులకునిద్ర రాకుండా చేస్తున్నాం.. అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు బిక్కు బిక్కు మంటూ ఉంటే.. కూటమి వచ్చాక.. ప్రశాంతంగా ఉంటున్నారు. ఇదీ.. కూటమి పాలన ప్రత్యేకత అని చంద్రబాబు చెప్పారు.