ఏపీలో గత కొద్దిరోజుల నుంచి సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలకంగా ఉన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు విచారించిన అనంతరం అధికారులు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం మాఫియా కోటి పేద కుటుంబాలు నాశనం అయ్యాయని.. ఈ భారీ స్కామ్ లో మిథున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమే, రియల్ మాస్టర్ మైండ్స్ వైఎస్ జగన్, భారతి అని మాణికం ఆరోపణలు చేశారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్‌లను తక్కువ గ్రేడ్, హానికరమైన వాటితో భర్తీ చేసి.. రూ. 3,200 కోట్లను వైసీపీ నాయకులు అడ్డంగా దోచుకున్నారని, ఆ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేశారని మాణికం ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన కుంభకోణం కాదు.. జగన్ సైంటిఫిక్ కరప్షన్ ద్వారా ప్లాన్ చేయబడిన ఆపరేషన్ అని ఆయన అన్నారు.
మొదట మద్యం బ్రాండ్లను ఎంపిక చేసుకున్నారు, పంపిణీ నెట్‌వర్క్‌ను ఫిక్స్ చేసుకున్నారు, కిక్‌బ్యాక్‌లను ముందస్తుగా చర్చించారు, ఆపై నకిలీ సంస్థలు సృష్టించారు.. ఫైనల్ గా దోపిడీని చట్టబద్ధం చేయడానికి లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారని మాణికం ఠాగూర్ తెలిపారు. అలాగే ఈ మద్యం కుంభకోణం ఎలా అమలు చేశారో కూడా మాణికం వివరించారు.
- జగన్ పార్టీ నాయకులు మద్యం సరఫరాదారులతో సమన్వయం చేసుకున్నారు.
- గతంలో ఉన్న లిక్కర్ బ్రాండ్స్, విశ్వసనీయ మద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో లేకుండా చేశారు.
- బినామీల యాజమాన్యంలోని వారి స్వంత తక్కువ ప్రసిద్ధ బ్రాండ్‌లు వాటి స్థానంలోకి తీసుకొచ్చారు
- ఈ బ్రాండ్‌లను రాష్ట్ర రిటైల్ ద్వారా అధిక ధరలకు విక్రయించారు.
లాభ మార్జిన్?
• కల్తీ బ్రాండ్స్ అయిన కూడా ధరలు కృత్రిమంగా పెంచారు.
• నకిలీ ఇన్‌వాయిస్‌లు మరియు సేవా ఒప్పందాల ద్వారా కమీషన్‌లను మళ్లించారు.
• డబ్బును వైట్ చేయడానికి హైదరాబాద్, బెంగళూరు మరియు విశాఖపట్నంలో షెల్ కంపెనీలను ప్రారంభించారు.
రవాణా మరియు గిడ్డంగుల ఒప్పందాలను కూడా ప్రాక్సీ సంస్థలకు ఇచ్చారు. వీటిని లాజిస్టిక్స్ ఖర్చులుగా చూపించారు. కానీ నిజానికి అవి ప్రజా ధనాన్ని హరించే మార్గాలు అని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా ప్రధానంగా జగన్, భారతి, కొందరు మంత్రులు మరియు వారితో సన్నిహితంగా మెలిగే కాంట్రాక్టర్లు ప్రయోజనం పొందారని మాణికం ఆరోపించారు.
2020–2024 మధ్య కనీసం రూ. 3,200 కోట్లు మళ్లించారని సిట్ పరిశోధనలు చెబుతున్నాయి. దీనిలో కొంత భాగం 2024 ఎన్నికల ప్రచారంలోకి పంపబడింది. ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో ప్రజలకు నగదు, ఉచిత మద్యం పంపిణీ చేశారు. ఓటు కొనుగోలు మరియు బూత్ నిర్వహణ కోసం ఉపయోగించారని మాణికం పేర్కొన్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో మిధున్ రెడ్డి చీఫ్ ఆపరేటర్‌గా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ మరియు రాజకీయ కార్యాలయాల మధ్య సమన్వయం చేయడంలో ఆయన సహాయపడ్డారు. లంచాల ప్రవాహాన్ని దాచడానికి ఉపయోగించే షెల్ కంపెనీలను ఆయన నిర్వహించేవారని మాణికం ఆరోపణలు చేశారు.
ఇక ఇది జగన్ మొదటి స్కామ్ కాదు. సిబిఐ దాఖలు చేసిన రూ. 43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఆయన ఇప్పటికే ప్రధాన నిందితుడు. 2012లో ఆయన అరెస్టు అయ్యి 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. జగన్ కు అవినీతి కొత్త కాదు. స్కామ్‌లు కొత్త కాదు. ఇసుక మాఫియా, మైనింగ్ మరియు భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, తాజాగా ప్రజారోగ్యానికి హామీగా మద్యం దోపిడీ.. ఇవన్నీ ఆయన చేసినవే. బాధితులు ఎవరంటే పేదలు, నోరు లేనివారు, ఓటర్లు అంటూ మాణికం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.