తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకొని పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన నారా లోకేష్.. తొలినాళ్లలో ఎన్నో అవమానాలు, మరెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముద్దపప్పు అంటూ వైసీపీ దారుణంగా ట్రోల్ చేసిన, 2019 ఎన్నికల్లో మంగళగిరి నిమోజవకర్గంలో ఓటమి పాలైన నారా లోకేష్ మాత్రం వెనకడుగు వేయలేదు. పదేళ్లు తిరిగే సరికి పప్పు అన్న వారి చేతే నిప్పు అనిపించుకున్నారు. ఓడిన చోటే నెగ్గి చూపించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ తరానికి టార్చ్ బేరర్ గా మారారు.
అయితే స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే నారా లోకేష్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు అనుకుంటే పొరపాటే. నిజానికి రాజకీయాల్లోకి రాకముందు నారా లోకేష్ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేశారు. తాజాగా ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లోకేష్.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఐదేళ్లు ఫ్యామిలీ బిజినెస్‌లను చూసుకున్నానని.. ఆ తర్వాతే పాలిటిక్స్ లోకి వచ్చి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని లోకేష్ పేర్కొన్నారు.
అలాగే ఇంట్లో, ఆఫీస్‌లో చంద్రబాబును ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. `కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నాకు బాస్. అదే పై ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఎప్పుడూ ఇంట్లోకి రావు, అదే విదంగా ఆఫీస్‌లోకి పర్సనల్ విషయాల గురించి చర్చించము. ఇది మా ఇంట్లో అందరం కచ్చితంగా ఫాలో అయ్యే రూల్. ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన్ను నేను నాన్న అనే పిలుస్తాను` అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.