పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఐదేళ్లకు పైగా మేకింగ్ దశలోనే ఉండడం.. వాయిదాల మీద వాయిదాలు పడడం.. బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం.. ఆశ్చర్యం కలిగించే విషయాలు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరిగింది. రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయింది. దీంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. ఈ సినిమాను పూర్తి చేయడానికి, రిలీజ్ చేయడానికి నిర్మాత ఏఎం రత్నం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
బడ్జెట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగకపోయినా.. ఎలాగోలా సర్దుబాటు చేసుకుని సినిమాను ఈ నెల 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు రత్నం. అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో తాను ఆశించిన రేటును బయ్యర్లు ఇవ్వకపోవడంతో తనే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారాయన. ఇలాంటి స్థితిలో ఆయనకు ఊహించని సమస్య తలెత్తింది. ఆయన ప్రొడక్షన్లో వచ్చిన పాత చిత్రాలకు సంబంధించి బాకీలు చెల్లించాలని, ఆ తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఎప్పుడో 19 ఏళ్ల కిందట రత్నం.. పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించిన ‘బంగారం’ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు సంబంధించి నష్టాలు సెటిల్ చేయాలంటూ ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడం గమనార్హం. దాంతో పాటు రత్నం చిన్న కొడుకు రవికృష్ణ నటించిన ‘ముద్దుల కొడుకు’ సినిమా నష్టాల గురించి కూడా ఒక ఫిర్యాదు వెళ్లింది. అంతే కాక జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ‘ఆక్సిజన్’ సినిమా నష్టాల గురించి మరో డిస్ట్రిట్యూటర్ సైతం రత్నం మీద కంప్లైంట్ చేశారు. దీని గురించి ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
ఐతే ‘బంగారం’, ‘ముద్దుల కొడుకు’ రిలీజై ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ టైంలో కొర్రీలు వేయడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు జూన్‌లో ‘వీరమల్లు’ రిలీజ్ అనుకుంటే.. థియేటర్ల బంద్ అంటూ అనుకోని సమస్య తెరపైకి వచ్చింది. దాని మీద ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల కిందటి సినిమాల నష్టాల గురించి లేవనెత్తడం చూస్తే ‘వీరమల్లు’కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.