రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు చాలా సులువుగా ఇవ్వడం మొదలైంది. కానీ గత ఏడాది చివర్లో ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న విషాదంతో తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అదనపు రేట్లకు తెరపడింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు మంత్రులు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉండడంతో నెమ్మదిగా మన నిర్మాతలు బెనిఫిట్ షోలు, అదనపు రేట్ల కోసం అప్లికేషన్లు పెట్టడం కూడా మానేశారు.
ఇలాంటి టైంలో సీనియర్ నిర్మాత ఏఎం రత్నం ‘హరిహర వీరమల్లు’ షోలు, రేట్ల కోసం సీఎం, మంత్రులన కలవడం చర్చనీయాంశం అయింది. ఐతే ఈ సినిమాకు మాత్రమే అవకాశం కల్పిస్తే.. మిగతా చిత్రాల నిర్మాతలు గొడవ చేయొచ్చని.. కాబట్టి అందరికీ ఒకే రూల్ పాటిస్తారని.. రత్నం విజ్ఞప్తిని పట్టించుకోకపోవచ్చని ఇండస్ట్రీలో చర్చించుకున్నారు. ఆల్రెడీ ఏపీలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు జీవో కూడా వచ్చేసింది. ఇక తెలంగాణలో అందుకు అవకాశం లేనట్లే అని అంతా అనుకున్నారు.
కానీ రత్నం మాత్రం తమ సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకునే, రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తారని ధీమాగా ఉన్నారు. మీడియాకు కూడా అదే విషయం చెప్పారు. ఈ సినిమాకు మాత్రం ఆ అవకాశం ఇస్తున్నారు అంటే అందుకు ఒక కారణం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రం ఈ ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇదే విషయాన్ని రత్నం ప్రపోజల్ పెట్టినపుడు కూడా మంత్రి ప్రస్తావించారట. ఐతే తమది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమానే అని, ఆ కేటగిరీలోకే వస్తుందని రత్నం అనడంతో సానుకూలంగా స్పందించారట.
ఏపీ జీవో వచ్చాక దాన్ని చూపించమని అడిగారట. తాము ఆ జీవోను మంత్రికి పంపించామని.. కాబట్టి ఒకట్రెండు రోజుల్లో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు వస్తాయని అంటున్నారు రత్నం. ‘హరిహర వీరమల్లు’ను భారీ ఖర్చు పెట్టి అత్యున్నత ప్రమాణాలతో తీశామని.. ఇలాంటి సినిమాకు టికెట్ల రేట్లు పెంచడంలో తప్పు లేదని.. అంతంత ఖర్చు పెట్టి ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నపుడు సినిమాను తక్కువ రేటుకు ఎలా చూపించగలమని.. అలా అయితే నిర్మాత ఎలా బతుకుతాడని ఆయన ప్రశ్నించారు.