స్థాయి చిన్నదే కావొచ్చు. కొందరు చేసే పనులు అందరిని ప్రభావితం చేయటమే కాదు.. కొత్త గొంతకు ప్రతీకగా నిలుస్తుంటారు. మిగిలిన రాజకీయ పార్టీలను పక్కన పెడితే.. తెలుగుదేశం క్యాడర్ కు కొత్త స్ఫూర్తిగా నిలిచిన ఒక చిన్న కార్యకర్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు మాట్లాడుకునేలా చేశారు. అతనే.. తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడు.. పార్టీ కోసం దేనికైనా.. ఎంతకైనా వెళ్లే కార్యకర్తగా సుపరిచితుడు 50 ఏళ్ల నంబూరు శేషగిరిరావు. గత ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సంచలనంగా ఆయన వ్యవహారశైలి మారింది.
తిరుగులేని అధికారంతో ప్రశ్నించేందుకు సైతం భయపడేలా వ్యవహరించే ఒక నేతను అడ్డుకోవటం.. ప్రశ్నించటం.. ఆయన తప్పుల్ని వేలెత్తి చూపటమే కాదు.. ఆయన బలప్రదర్శనను ఎదుర్కొనేందుకు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిన వైనం అప్పట్లో అందరూ నంబూరు గురించి మాట్లాడుకునేలా చేసింది. పాలువాయిగేటు గ్రామంలోని పోలింగ్ బూత్ లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉన్న ఆయన.. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి తన అనుచరులతో పోలింగ్ బూత్ లోకి చొరబడి.. ఈవీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు.
అదే బూత్ లో టీడీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న శేషగిరిరావు.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటమే కాదు.. ధైర్యంగా ఎదురు నిలిచారు.దీంతో.. పిన్నెల్లి అనుచరులు ఆయన్ను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చినంతనే నంబూరుపై కర్రలతో దాడి చేసి గాయపర్చారు. అప్పట్లో ఆ ఘటన ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. టీడీపీ క్యాడర్ కు నంబూరు శేషగిరి కొత్త ధైర్యంగా నిలిచారు. మిగిలిన వారు సైతం తమ రాజకీయ ప్రత్యర్థులతో పోరాడేందుకు అవసరమైన స్ఫూర్తిని అందించారు.
శేషగిరిరావు తీరును పార్టీ అధినేత చంద్రబాబు.. లోకేశ్ ప్రశంసించారు. అలాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించిన నంబూరు శనివారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల వేళలో ఆయన పొరుగింట్లో ఉండే వారు చూడగా.. శేషగిరిరావు వాకిట్లో పడిపోయి ఉన్న విషయాన్ని గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు చెప్పారు.
ఆయన భార్య క్రిష్ణవేణి వ్యక్తిగత పనుల మీద అంతకు మూడు రోజుల క్రితమే హైదరాబాద్ కు వెళ్లగా..కొడుకు దత్తసాయి ఉన్నత చదువుల కోసం గుంటూరులో.. కూతురు జాహ్నవి హైదరాబాద్ లో ఉండి చదువుకుంటున్నారు. శనివారం రాత్రి పది గంటల వరకు చుట్టుపక్కల వారితో మాట్లాడిన ఆయన తర్వాత నిద్రకు ఉపక్రమించటం.. నిద్రలోనే గుండెపోటుతో మరణించారు. నంబూరు మరణం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. మంత్రి నారా లోకేశ్ లు విచారం వ్యక్తం చేయటమే కాదు.. వారి కుటుంబానికి తాము.. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన ధైర్యసాహసాలతో టీడీపీ కార్యకర్తలు.. పార్టీ నేతలకు సుపరిచితుడైన నంబూరు అకాల మరణం అందరిని విచారానికి గురి చేసిందని చెప్పాలి.