సైయారా.. సైయారా.. ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో ఆషిఖి-2, ఏక్ విలన్ ఫేమ్ మోహిత్ సూరి రూపొందించిన లవ్ స్టోరీ ఇది. పెద్ద బేనర్, పేరున్న దర్శకుడు ఉన్నా సరే.. సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించడంలో హీరో హీరోయిన్ల పాత్ర కీలకం. వాళ్లు స్టార్లు అయితేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. కానీ అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే ముక్కూ మొహం తెలియని కొత్త హీరో హీరోయిన్లు నటించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. డెబ్యూ హీరో హీరోయిన్లు నటించిన సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ రావడం, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడమే ఆశ్చర్యం అంటే.. రిలీజ్ తర్వాత ఈ సినిమాకు వస్తున్న స్పందన మరింత షాకింగ్‌గా ఉంది. తొలి రెండు రోజుల్లో రూ.47 కోట్ల వసూళ్లు రాబట్టి ఔరా అనిపించిన ఈ చిత్రం.. మూడో రోజు మరింతగా ఆశ్చర్యపరిచింది.
ఆదివారం ‘సైయారా’ సినిమాకు ఏకంగా రూ.37 కోట్ల వసూళ్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ మల్టిప్లై అయి సినిమా జనాల్లోకి బాగా వెళ్లిపోవడంతో మూడో రోజు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ఉత్తరాదిన మల్టీప్లెక్సులన్నీ హౌస్ ఫుల్స్‌తో నడిచాయి. సింగిల్ స్క్రీన్లలోనూ జనాలకు కొదవ లేదు. మామూలుగా ఇలాంటి ప్రేమకథా చిత్రాలకు పెద్ద సిటీలు, మల్టీప్లెక్సుల్లో మాత్రమే మంచి ఆదరణ ఉంటుంది. కానీ ‘సైయారా’కు పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయి.. చిన్న టౌన్లలో కూడా సినిమా బాగా ఆడుతోంది. మూడో రోజు రూ.37 కోట్ల వసూళ్లు రావడం అన్నది పెద్ద పెద్ద స్టార్లకు కూడా చాలా కష్టమైపోయిన పరిస్థితి. వీకెండ్ మొత్తం కూడా ఈ కలెక్షన్లు రాబట్టని స్టార్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటిది కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమా, అది కూడా ఒక లవ్ స్టోరీకి ఇలాంటి కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ పండిట్లకు కూడా షాకింగ్‌గా ఉంది. కొన్నేళ్లుగా స్లంప్‌లో ఉన్న బాలీవుడ్‌కు గొప్ప ఉత్సాహాన్నిస్తూ.. యువతను మెప్పించే మంచి ప్రేమకథా చిత్రాలు తీస్తే స్పందన ఎలా ఉంటుందో ఈ సినిమా పాఠాలు నేర్పింది. ఈ ఊపు చూస్తుంటే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.300 కోట్ల వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది.