పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ `హరిహర వీరమల్లు` ఈనెల 24న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కింది. కానీ అనివార్య కారణాలతో షూటింగ్ మధ్యలోనే క్రిష్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. మిగతా భాగాన్ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నంతో విభేదాల కారణంగానే క్రిష్ వీరమల్లు నుంచి తప్పుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది.
ఈ ప్రజారాన్ని రీసెంట్‌గా ఏఎం రత్నం ఖండించారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని.. వేరే కమిట్మెంట్స్ కారణంగా క్రిష్ వీరమల్లు నుంచి సైడ్ అయ్యారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు క్రిష్ మాత్రం ఈ సినిమా విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. వీరమల్లు ప్రమోషన్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సోమవారం మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. కనీసం ఈ ఈవెంట్ కు అయిన క్రిష్ వస్తారని అనుకున్నారు.. కానీ ఆయన రాలేదు. దీంతో ఈ విషయంపై నెట్టింట చర్చలు ప్రారంభం అయ్యాయి.
ఇదే తరుణంలో క్రిష్ నుంచి తాజాగా ఓ ఊహించని ట్వీట్ వచ్చింది. `హరి హర వీర మల్లు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతుంది.. నిశ్శబ్దంగా కాదు.. బలైమన సంకల్పంతో. ప్రతి ఫ్రేమ్ వెనుక చరిత్ర యొక్క బరువు మరియు అభిరుచి దాగుంది. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది... సినిమాలోనే కాదు, ఆత్మలోనూ పవన్ కళ్యాణ్ గారు అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరాకు చిక్కని ఫైర్ ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి. అదే హరి హర వీరమల్లుకి ప్రాణం పోసింది. సినిమాకు వెన్నెముక, ఆత్మ మరియు తుఫాను ఆయనే.
ఏఎం రత్నం గారు గొప్ప శిల్పి. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఆయన సామర్థ్యం చాలా అరుదు. ఆయన అచంచలమైన బలం వల్లనే హరి హర వీర మల్లు పూర్తైంది. ఈ సినిమా వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైనది. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను, అసౌకర్య సత్యాలను అన్వేషించే వాడిగా, సినిమాను నమ్మే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతను అందిస్తున్నాను. ఏళ్ల తరబడి కొనసాగిన నిరీక్షణకు ముగింపు పలుకుతూ వెండితెరపై ఆవిష్కరించబడనున్న హరి హర వీరమల్లు ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయిందని నేను నమ్ముతున్నాను. ప్రేమ మరియు కోపంతో క్రిష్ జాగర్లముడి` అంటూ ఎక్స్ వేదకగా క్రిష్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.