వైసీపీ నాయకుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. సర్కారుకు లొంగిపోతే.. కార్యకర్తలతో ఇబ్బందులు. వారి ముందు చిన్నచూపు. అలాగని కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేస్తే.. ఇటు సర్కారుతో తల నొప్పులు వస్తున్నాయి. దీంతో రెండు విధాలుగా కూడా.. వైసీపీ నాయకులు నలిగిపోతున్నారు. విషయం ఏంటంటే.. ప్రస్తుతం వైసీపీ నాయకులపై కేసులు విచ్చలవిడిగా నమోదవుతున్నాయి. కారణాలు ఏవైనా కూడా.. నాయకులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా పోతోంది.
ఒక కేసును వదులుకుంటే.. మరో కేసు. ఒక కేసులో బెయిల్‌పై బయటకు వస్తే.. మరో కేసులో పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో రాజకీయాలంటేనే.. నాయకులు భయ పడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండిపోతే.. ఏ సమస్యా లేదని భావిస్తున్నారు. అందుకే వైసీపీలోని కీలక నాయ కులు చాలా మంది మౌనంగానే ఉన్నారు. ఇలాంటి వారిని పోలీసులు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. వీరిలో తప్పులు చేసిన నాయకులు కూడా ఉన్నారు. అయినా.. వారు సేఫ్‌గానే ఉన్నారు.
ఇలా ఉంటే.. ఏం జరుగుతుంది? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. కార్యకర్తలు, పార్టీ అధినేతకు కూడా సదరు నాయకులు దూరమవుతున్నారు. కార్యకర్తలు జోష్ గా తిరగడం లేదు. నాయకులను కూడా పట్టించుకో వడం లేదు. ఇక, పార్టీ అధిష్టానం నుంచి కూడా విమర్శలు, హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో కొందరు నాయకులు సర్కారుపై విమర్శలు చేయడం.. పోలీసులపై విరుచుకుపడడం, జగన్ ప్రజల మధ్యకు వస్తే.. కార్యకర్తలను సమీకరించడం చేస్తున్నారు. ఇలా చేసిన వారిపై సర్కారు కన్నెర్ర చేస్తోంది.
ఫలితంగా కేసులపై కేసులు నమోదవుతున్నాయి. పోనీ.. ఒక కేసులో ఏదో ఒకరకంగా బయట పడితే.. మరో కేసు వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో అటు కార్యకర్తల కోసం .. నోరు చేసుకుంటే.. ఇటు సర్కారు, పోనీ.. ఇటు సర్కారు కోసం సైలెంట్‌గా ఉంటే.. అటు కార్యకర్తలు, అధిష్టానం నుంచి కూడా సెగ తగులుతోంది. ఈ పరిణామాలతోనే వైసీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. జగన్ పర్యటనలు అంటే భీతిల్లే పరిస్థితి వచ్చేసింది. మున్ముందు కూడా ఇదేవిధానం కొనసాగితే.. ఖచ్చితంగా నాయకులు ఏపీని వదిలి పోయే అవకాశం ఉందన్న చర్చ కూడా తెరమీదికి రావడం గమనార్హం.