పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ `హరిహర వీరమల్లు` ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. కోహినూర్ వజ్రం కోసం పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపిస్తారు. ఆయనకు జోడిగా పంచమి పాత్రలో నిధి అగర్వాల్.. విలన్ గా బాబీ డియోల్ నటించారు. జూలై 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ మరియు ప్రమోషన్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వీరమల్లు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ యొక్క సర్ప్రైజింగ్ ఎంట్రీ ఉంటుందట. శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ లో ఆయన కనిపించబోతున్నాడని ప్రముఖ యూట్యూబర్ `నా అన్వేషణ` అన్వేష్ వెల్లడించాడు.
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న అన్వేష్.. హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ చేస్తున్నట్టు తెలిపాడు. సినిమా సూపర్ గా ఉందని.. థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయమని అన్వేష్ తెలిపాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలుగా అతిథి పాత్రలో బాలయ్య కనిపిస్తారని.. ఆయన ఎంట్రీ అదిరిపోతుందని పేర్కొన్నాడు. కానీ చివర్లో ఇదంతా ఫేక్ అని చెప్పి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు అన్వేష్. తాను అసలు సినిమానే చూడలేదని.. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని, రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలనే ఈ వీడియో చేశానని అన్వేష్ పేర్కొన్నాడు. మొత్తానికి మొదట ఊరించి.. చివర్లో ఉసూరుమనిపించాడు.