ఒకప్పుడు మెగా అభిమానులంటే అంతా ఒక్కటే. ఆ కుటుంబంలోని అందరు హీరోలనూ ఫ్యాన్స్ అభిమానించేవాళ్లు. ఆ హీరోల్లాగే అభిమానులూ కలిసి సాగేవాళ్లు. ఎవరి మీదా వ్యతిరక భావం ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. మెగా అభిమానుల్లో వర్గాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేరైపోయారు. రకరకాల కారణాలతో మిగతా మెగా అభిమానులకు, బన్నీ ఫ్యాన్స్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చేసింది. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య దశాబ్దాలుగా వైరం ఉండగా.. దానికి ఏమాత్రం తగ్గని విధంగా మెగా, బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈ అవకాశాన్ని వైరి వర్గాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ముఖ్యంగా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బన్నీ.. తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి ప్రచారం చేసిన దగ్గర్నుంచి వ్యవహారం పూర్తిగా ముదిరిపోయింది. పవన్ ఫ్యాన్స్, బన్నీ అభిమానుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. దీన్ని అదనుగా చూసుకుని బన్నీని, ఆయన అభిమానులను వైసీపీ మద్దతుదారులు ఓన్ చేసుకుని వారిని రెచ్చగొట్టే పనిలో పడిపోయారు. సందర్భం వచ్చినపుడల్లా బన్నీ అభిమానులను.. పవన్, ఆయన ఫ్యాన్స్ మీదికి ఉసిగొల్పడం ద్వారా వారి మధ్య వైరాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీయన్స్.
పవన్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజవుతున్న నేపథ్యంలో.. పవన్ మీద, ఆ చిత్రం మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఇందులో బన్నీ ఫ్యాన్సే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వారిని వైసీపీ మద్దతుదారులు వెనుక ఉండి నడిపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్లంతా బన్నీ ఫ్యాన్సేనా.. లేక బన్నీ డీపీ పెట్టుకుని విషం చిమ్ముతున్న వైసీపీ మద్దతుదారులా అనే సందేహాలు కలుగుతునన్నాయి. వారి పోస్టులు మాత్రం దారుణంగా ఉంటున్నాయి.
నిన్న ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్, ప్రి రిలీజ్ ఈవెంట్‌లకు పవన్ హాజరైన సందర్భంగా అక్కడి వీడియోలు, ఫొటోలను వాడుకుంటూ మునుపెన్నడూ లేని స్థాయిలో ఆయన్ని ట్రోల్ చేశారు. ప్రెస్ మీట్లో ప్రసంగించిన పవన్‌ను సాల్మన్ రాజు క్యారెక్టర్‌తో పోల్చడం ఒకెత్తయితే.. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తన భార్యతో కలిసి హాజరైన పవన్‌ను ‘రామయ్యా వస్తావయ్యా’లో రవిశంకర్ చేసిన విలన్ పాత్రతో పోల్చి మీమ్స్ వేయడం మరో ఎత్తు.
కుటుంబ సభ్యులను కూడా లాగి, వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న ఈ పోస్టులు పవన్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వైసీపీ మద్దతుదారులతో పాటు ఎక్కువగా బన్నీ డీపీ పెట్టుకున్న వాళ్లే ఈ పోస్టులు పెడుతుండడంతో వారి కోపం కట్టలు తెంచుకుంటోంది. బన్నీ ఫ్యాన్స్‌గా చెప్పుకుంటున్న వాళ్లు వైసీపీ ఉచ్చులో పడి అకారణంగా పవన్‌ను టార్గెట్ చేస్తున్నారని.. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.