భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. 2022 ఆగస్టులో జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అయినప్పటికీ జగదీప్ చాలా ముందే పదవి నుంచి వైదొలిగారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు జగదీప్ లేఖలో పేర్కొనడం.. రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు భారత్ కు కొత్త ఉప రాష్ట్రపతి ఎవరు? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉప రాష్ట్రపతి రేసులో ఇప్పటికే నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి నితీశ్ కుమార్ ను సీఎం సీటు నుంచి తప్పించి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిశీత్ కూడా ఉపరాష్ట్రపతి పదవిని ఆశిస్తున్నారని ఎప్పటినుంచో బలమైన టాక్ ఉంది. నితీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం కోసమే కమలం పార్టీ పెద్దలు జగదీప్ ధన్‌ఖడ్ చేత రాజీనామా చేయించారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ శశిథరూర్ కూడా ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారు. గత కొంత కాలం నుంచి శశిథరూర్ కాంగ్రెస్‌కు దూరమవుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈయన హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వీకే సక్సేనాకు కేంద్రం అవకాశం కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆప్ ప్రభుత్వం పరిపాలనా చర్యలను అడ్డుకోవడం ద్వారా ఢిల్లీ రాజకీయాల్లో గత మూడేళ్లుగా వీకే సక్సేనా కీలక పాత్ర పోషించారు. నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విభేదించి కేంద్రం దృష్టిలో పడ్డారు. దీంతో ఇప్పుడు ఉప రాష్ట్రపతి రేసులో ఆయన సైతం చేరారు.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ బీజేపీ నేత మనోజ్ సిన్హా ఆగస్టు 6న తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు, ఇది ఉపరాష్ట్రపతిగా తదుపరి స్థాయి ఉద్యోగాన్ని చేపట్టడానికి సరైన సమయం. మరి తీవ్ర పోటీ నడుమ ఉప రాష్ట్రపతి పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి.