ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు నేడు విడుదలైంది. బుధువారం నైట్ నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఇంతకీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ తొలి చిత్రం హిట్టా? ఫట్టా?.. పబ్లిక్ టాక్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన హరి హర వీరమల్లు జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో పూర్తైంది. నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్ కాగా.. బాబీ డియోల్, సత్యరాజ్, విక్రమ్ జీత్, నాజర్, తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. హరిహర వీరమల్లు 17వ శతాబ్దానికి చెందిన కథ. కృష్ణానదీ తీర ప్రాంతంలో మొదలైన ఈ కథ హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. దొంగతనాలు చేస్తూ సనాతన ధర్మం కోసం పోరాడే వీరమల్లు(పవన్ కళ్యాణ్) ఢిల్లీ బాద్ షా ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు బయటలుదేరతాడు.
ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలు ఏంటి? హిందువుగా ఉండాలంటే జిజియా పన్ను కట్టాలని శాసించిన ఔరంగజేబ్ కు వీరమల్లు సింహస్వప్నంగా ఎలా మారాడు? ఔరంగజేబు అరాచకాలకు వీరమల్లు ఎలా ఎదురు తిరిగాడు? అన్నదే వీరమల్లు స్టోరీ. కథ పరంగా చూస్తే కొత్తదనం కనిపిస్తుంది. కానీ కథనం రొటీన్‌గా సాగుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ నేపథ్యంలో సెకండ్ హాఫ్ ఎక్కువగా నడుస్తుంది. సనాతన ధర్మం అంశాన్ని కూడా బాగా వాడుకున్నారు. రాబిన్‌హుడ్ తరహా క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడని.. కథానాయకుడి పాత్రను, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ఫస్టాఫ్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. అలాగే సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ప్రధాన బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాపడుతున్నారు.
అలాగే క్రిష్ తీసిన సన్నివేశాల చాలా బాగున్నాయని.. జ్యోతి కృష్ణకు దర్శకత్వ అనుభవం అంతగా లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. పంచమి పాత్రలో నిధి అందంగా కనిపించింది. కీరవాణి స్వరాలతోనే కాదు నేపథ్య సంగీతంతోనూ సినిమాకు ప్రాణం పోశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ నటన, కీరవాణి సంగీతం, యాక్షన్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. అయితే విజువల్స్ మాత్రం అంతగా మెప్పించలేకపోయాయని చెబుతున్నారు. సెకండాఫ్ లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్ విసుగు పుట్టిస్తాయి. ఇక ఫైనల్ గా హరిహర వీరమల్లు సూపర్ హిట్ అని పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటంటే.. యాంటీ ఫ్యాన్స్‌తో పాటు వైసీపీ మద్దతుదారులు మాత్రం సినిమా ఫ్లాప్ అని ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు సినిమా విశ్లేషకులు హరిహర వీరమల్లు ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు.