ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు.. వివాదాలకు కేరాఫ్ అన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడ ఏం చేసినా.. వివాదాలను వెంటబెట్టుకుని అడుగులు వేస్తారు. గతంలోనూ అనేక సార్లు ఆయన వివాదాలలో చిక్కుకున్నారు. అయితే.. పార్టీ ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరించడం.. తర్వాత నాలుగు రోజులు మౌనంగా ఉండడం.. ఆ తర్వాత మళ్లీ మామూలే.. అన్నట్టుగా కొలికపూడి వ్యవహరిస్తున్నారు. తాజాగా కూడా కొలిక పూడి వివాదానికి దారితీసేలా వ్యవహరించారు. నేరుగా పోలీసు స్టేషన్‌లోనే ఆయన పంచాయతీ పెట్టారు.
పోలీసులే.. నేరుగా గంజాయిని అమ్మాలని ప్రోత్సహిస్తున్నారని కొలికపూడి విమర్శించారు. తిరువూరు పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన కొలికపూడి.. నేరుగా సీఐతో మాట్లాడారు. ఎస్సై సత్యనారాయణ.. యువతను గంజాయి విక్రయించాలని ప్రోత్సహిస్తున్నా రని.. తద్వారా వచ్చిన సొమ్ములు వెనుకేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇది తన నియోజకవర్గంలో జరగడం తనకు దారుణంగా ఉందన్నారు. పోలీసులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిందిపోయి.. వారే నేరుగా గంజాయి విక్రయించే లా యువతను ఎలా ప్రోత్సహిస్తారని కొలికపూడి ప్రశ్నించారు. యువతను నియంత్రించాల్సిన ఇలా చేస్తారా? అని నిప్పులు చెరిగారు.
గంజాయి విక్రయాలకు సంబంధించి ఎస్సై.. సత్యనారాయణ ఎవరెవరిని ప్రోత్సహించారో.. తనవ ద్ద జాబితా ఉందని.. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయమంటారా? అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు.. ప్రస్తుతం వాటికి దూరంగా పనులు చేసుకుంటున్నారని కొలికపూడి చెప్పారు. కానీ, వారిని ఎస్సై సత్యనారాయణ స్టేషన్‌కు పిలిపించి.. బెదిరింపులకు దిగి.. మళ్లీ గంజాయి విక్రయించేలా ప్రోత్సహిస్తున్నారని.. భధ్రాచలం వెళ్లి గంజాయితీసుకువచ్చి.. ఇక్కడ విక్రయించాలని హుకుం జారీ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో యువత బెదిరిపోతున్నారని.. యువతను సన్మార్గంలో నడిపించాల్సిన పోలీసులు ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు.
టీడీపీ ఆగ్రహం..
అయితే..ఎమ్మెల్యే కొలికపూడి చేసిన వ్యాఖ్యలు నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బెదిరించిన వైనం టీడీపీ నేతల దృష్టికి వచ్చింది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? అంటూ.. కొలికపూడిపై అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే.. మంత్రుల దృష్టికి తీసుకురావొచ్చని.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం ఏంటని.. సీనియర్ నాయకులు కూడా ప్రశ్నించారు. కాగా.. గతంలోనూ కొలికపూడి అధికారులను బెదిరించిన ఘటనలు వివాదంగా మారాయి.