భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న ఓ రేర్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు. 2014లో తొలిసారి పదవిలోకి వచ్చిన మోదీ.. 2019లో తిరిగి గెలిచి, 2024లో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. నెహ్రూ తర్వాత మూడు సార్లు వరుసగా ప్రధానిగా ఎన్నికైన మొదటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే జూలై 25వ తేదీతో ప్రధానిగా మోదీ 4,708 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో విరామం లేకుండా దేశానికి ఏకధాటిగా ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 6,130 రోజులు పాటు చిరకాల సేవ అందించారు. ఆ తర్వాతి స్థానంలో ఇంతకు ముందు వరకు నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ ఉండేవారు. ఈమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారు.
1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. ఈ రికార్డును తాజాగా మోదీ అధిగమించారు. నెహ్రూ తర్వాత దేశానికి ఏకబిగిన ఎక్కువ కాలం ప్రధానిగా పరిపాలించిన రెండో వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. దీంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో నిరాడంబరమైన కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ.. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌లో తన తండ్రికి టీ అమ్మడంలో సహాయం చేశారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు అంతర్జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందే స్థాయికి చేరింది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఆ తరువాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హోదాల ద్వారా ఎదిగిన మోదీ.. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. ఇందిరా గాంధీ తర్వాత వరుస సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.