దేశ రెండో పౌరుడు/ పౌరురాలు.. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. దీనికి సంబంధించి ఎన్నిక నిర్వ హించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం.. ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తోంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు రెడీ అయింది. అయితే.. ఇంతలోనే.. కేంద్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ పోటీని తమ కు అనుకూలంగా మార్చుకుని.. నచ్చిన నాయకుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తమిళనాడు, బీహార్ సహా.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్లోని నాయకుల వైపుకూడా బీజేపీ పెద్దలు దృష్టిపెట్టారు.
ప్రస్తుతం విదేశీప ర్యటనలో ఉన్న ప్రధాన మంత్రినరేంద్ర మోడీ.. మరో మూడు రోజుల్లో దేశానికి రానున్నా రు. ఆయన వచ్చాక.. పేరును ఫైనల్ చేయనున్నారు. అయితే.. ఈలోగా ప్రతిపక్షం రెడీ అయింది. వాస్తవా నికి ఎలక్టోరల్ కాలేజీ అంటే.. పార్లమెంటు ఉభయ సభల్లోని ఎంపీలు. వీరు ఓటు వేసి గెలిపించే నాయకు లు ఉపరాష్ట్రపతి అవుతారు. ఈ పరంగా చూసుకుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి పెద్దగా బలం లేదు. అయినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గేను ఉప రాష్ట్రపతి పోస్టుకు పోటీలో పెట్టాలని దాదాపు నిర్ణయించింది. దీనికి ఇండియా కూటమిలోని నాయకులు కూడా పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. ఇది ఆయన గెలుపును సాకారం చేయకపోయినా.. బీజేపీని వ్యూహాత్మకంగా ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది. వచ్చే బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఓసీ సామాజిక వర్గానికి లేదా బీసీ సామాజిక వర్గానికి ఈ సీటును ఇవ్వాలన్నది బీజేపీవ్యూహం.
కానీ, కాంగ్రెస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఖర్గేను నిలబెట్టడం ద్వారా.. విధిలేని పరిస్థితిలో బీజేపీ కూడా ఎస్సీలను ఎంపిక చేసుకునే పరిస్థితిని కల్పించింది. అదేసమయంలో ఖర్గే అంటే.. బీజేపీలోనూ అభిమానించే వారు ఉన్నారు. కాబట్టి.. ఓట్లు చీలినా ఆశ్చర్యం లేదు. గతంలోనూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విపక్షానికి చెందిన ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యారు. అయితే. ఎక్కువ కాలం ఆయన పదవిలో లేరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ఒకవేళ ఖర్గే కనుక విజయం దక్కించుకునే పరిస్థితి ఏర్పడి అది నిజంగానే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిని తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.