ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సువర్ణ అవకాశాలు తలుపులు తెరిచి ఉన్నాయని.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో పట్టిన శనిని ప్రజలు వదిలించారని.. తాము ఆ భూతాలను పాతిపెడుతు న్నామని.. ఇక, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. అక్కడి భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో త్రులు పి.నారాయణ, నారా లోకేష్, టిజి భరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీ యుల కార్యకలాపాలను భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులే చంద్రబాబుకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్,ఏవియేషన్, సెమి కండక్టర్స్,పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను పేర్కొన్నారు. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. భారత్ లో ప్రత్యేకించి ఏపిలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందని తెలిపారు. సింగపూర్ తో రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని... తన పర్యటనలో కొన్ని రికార్డులను సరి చేసేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలు, పెట్టబడులకు గల అవకాశాలను వివరించారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్న సిఎం.. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపిలో ఇప్పటికే పట్టాలెక్కాయని వివరించారు. ఇండియా క్వాంట్వం మిషన్ లో క్వాటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుందని వివరించారు. డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఏపిలో పెట్టుబడులకు అవసరమై సహకారన్ని అందించాలని కోరారు.