ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి ఐదు రోజులపాటు సాగనున్న ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యంగా మొత్తం 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సింగపూర్ పర్యటనలో రెండో రోజు సోమవారంకు సంబంధించి షెడ్యూల్ పరిశీలిస్తే..
భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి టాన్‌సీలెంగ్‌తో ట్రెజరీ బిల్డింగ్‌లో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ భేటీలో విద్యుత్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్యలు జరుగుతాయి.
8.30 గంటలకు ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితో సీఎం సమావేశం కానున్నారు. 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం ఖరారు అయింది. 9.30 నుంచి 11 గంటల మధ్య బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
11 గంటలకు ఎవర్వోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్‌తో సీఎం బృందం సమావేశం అవుతుంది. 11.30కు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను చంద్రబాబు సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్‌లో పర్యటిస్తారు. పీఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో ఏపీ పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై జరిగే చర్చలో పాల్గొంటారు.
సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రప్రదేశ్-సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరై సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం జరగనుంది.