ఇటీవల కాలంలో లోలు మాల్స్ కు మన ఇండియాలో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. కేవలం షాపింగ్ చేయడానికి మాత్రమే కాకుండా మొత్తం ఫ్యామిలీకి ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌లా ఈ మాల్స్ మారాయి. గల్ఫ్ దేశాల్లో గొప్ప పేరొందిన లూలు గ్రూప్ ఇప్పటివరకు భారతదేశంలో కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో తన మాల్స్ విస్తరించింది. అయితే త్వరలోనే ఏపీకి లూలు మాల్స్ రాబోతున్నాయి. రాష్ట్రంలో లులు మాల్ ఏర్పాటుపై సదరు సంస్థ దృష్టి సారించింది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో లూలు మాల్స్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. తాజాగా ఏపీ సర్కార్ మాల్స్ ఏర్పాటు కోసం లూలు గ్రూప్ కు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ రహదారిలోని హెర్బల్ పార్కులో 99 ఏళ్ల లీజు ప్రాతిపాదికన 13.74 ఎకరాలను ఏపీఐఐజీ ద్వారా కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు.
అలాగే విజయవాడలో 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు ఆర్టీసీకి చెందిన 4.14 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ స్థలంలోని ఆర్టీసీ నిర్మాణాలను వేరే చోటకు తరలించనున్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి భూమి ఇచ్చి ఆ ప్రాజెక్టు స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే లూలు తలపెట్టిన ఈ ప్రాజెక్టును ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తూ మూడేళ్ల లీజును వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, విశాఖ, విజయవాడలో కలిపి మాల్స్ ఏర్పాటు లూలు సంస్థ రూ.1,222 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 1,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏడాదిలో మాల్స్ ను పూర్తి చేయాలని సంస్థ భావిస్తోంది.