సింగపూర్ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీ బిజీగా కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వరుస సమావేశాల్లో సీఎం పాల్గొంటున్నారు. రెండో రోజు సోమవారం పర్యటనలో ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా రికార్డులు సరి చేసేందుకే సింగపూర్ వచ్చానని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని చంద్రబాబు కోరారు.
డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాల్లో, మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమన్నారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రిని చంద్రబాబు ఆహ్వానించారు. కాగా, గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి వర్క్ చేసేందుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.