రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారంతా భాగస్వాములు కావాలంటూ ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో ఉన్న తెలుగు వారికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి రోజు ఆదివారం సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంతో పాటు పలు కీలక సమావేశాలు నారా లోకేష్ పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గత అయిదేళ్ల విధ్వంస పాలన చూశాక ఏపీకి కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అందుకే ఏ దేశం వెళ్లినా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును మనమంతా స్పూర్తిగా తీసుకోవాలని.. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న తెలుగు వారంతా రాష్ట్రాభివృద్ధి లో భాగస్వాములు కావాలని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడంలో ఏపీ మళ్లీ ఊపిరి తీసుకుంటోందన్నారు.
అదేవిధంగా భారత ప్రధాని మోడీజీ త్వరలోనే సింగపూర్ లో పర్యటిస్తారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొని .. ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు సర్వేశ్ మద్దుకూరి, హనుమంతరావు మాదాల, రేణుకుమార్ కన్నెగంటి, వెంకట్ భీమినేని, కంచేటి కరుణాకర్, త్రివిక్రమ్ నాదెళ్ల, కృష్ణ రామినేని, మురళి నాదెళ్ల, మధు గుడిపూడి, మారుతి సయంపు, భాష్యం రామారావు, బాలకృష్ణ వెలగ, పవన్ వీరమాచనేని, దివ్య వల్లభనేని, దీపిక రామినేని, జాహ్నవి వేమూరి తదితరులను నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. కాగా, ఇప్పటివరకు జరిగిన అత్యుత్తమ ఎన్ఆర్ఐ ఈవెంట్స్ లో ఒకటిగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది.