రాధికా ఆప్టే.. నార్త్ తో పాటు సౌత్ సినీ ప్రియులకూ సుపరిచితురాలే. 2005లో ఓ హిందీ మూవీతో బిగ్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన రాధికా ఆప్టే.. ఆ తర్వాత కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీ బిజీగానే గడిపింది. ఒక భాషకే పరిమితం కాకుండా హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్, మలయాళం, ఆంగ్లంలో సినిమాలు చేస్తూ స్టార్డమ్ ను సంపాదించుకుంది. తెలుగులో `రక్త చరిత్ర`, `లెజెండ్`, `సింహం` తదితర చిత్రాల్లో మెరిసింది.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2012లో లండన్ కు చెందిన సంగీతకారుడు బెనెడిక్ట్ టేలర్ ను రాధికా ఆప్టే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. వివాహం అయిన పన్నిండేళ్లకు రాధికా ఆప్టే దంపతులు తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. 2024 డిసెంబర్ లో రాధిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయిన తర్వాత తొలి మూడు నెలలు చాలా దారుణంగా గడిచాయని రాధికా ఆవేదన వ్యక్తం చేసింది.
గర్భవతిగా ఉన్న టైమ్‌లో ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నానని.. ప్రెగ్నెంట్ అని చెప్పినా ఆ చిత్ర నిర్మాత తన పట్ల మానవత్వం చూపలేదని రాధికా చెప్పుకొచ్చింది. మూడు నెలల గర్భంతో ఉన్నాను. శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. అయిన కూడా టైట్ దుస్తులు ధరించాల్సిందే అని నిర్మాత బలవంతం చేశాడు. అసౌకర్యంగా ఉందని చెప్పినా వదల్లేదు. సెట్‌లో నొప్పితో బాధపడుతున్నా వైద్యుడిని కలిసేందుకు అనుమతించలేదు. అలానే షూటింగ్ కొనసాగించారు అంటూ రాధికా ఆప్టే నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నేనెప్పుడూ ప్రత్యేక సౌకర్యాలు కోరలేదు. వృత్తి పరంగా ఎంతో నిబద్ధతతో, నిజాయతీగా ఉంటాను. కానీ ఇలాంటి సమయంలో కొంత మానవత్వం, సానుభూతి ఉంటే చాలు అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్షేషన్ గా మారింది.