ఫామ్‌హౌసే కేసీఆర్‌కు జైలు.. ఇంకెందుకు అరెస్ట్..!

admin
Published by Admin — August 08, 2025 in Politics, Telangana
News Image

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి,  గులాబీ బాస్‌ కేసీఆర్ అధికారం కోల్పోయాక ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌హౌస్‌కే ప‌రిమితం అయ్యారు. ఈ విష‌యంలో పాలక పక్షం ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి కేసీఆర్‌కు చుర‌క‌లు వేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌ను చర్లపల్లి సెంట్ర‌ల్ జైలుతో పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా? అని విలేకరులు ప్ర‌శ్నించ‌గా.. రేవంత్ రెడ్డి షాకింగ్ రిప్లై ఇచ్చారు.


ఫామ్‎హౌజ్‎లో ఆయనకు ఆయనే బందీ అయ్యి ఉన్నారు.. ఇంకెందుకు కేసీఆర్‌ను అరెస్ట్ చేయ‌డం అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యం చేశారు. కేసీఆర్ ఫామ్‎హౌస్‎కు.. చర్లపల్లి జైలుకు తేడా ఏముంది..? ఫామ్‎హౌజ్‎లో పర్యవేక్షణ ఉంటుంది.. జైల్లో పహారా ఉంటుంది.  జైలులో ఖైదీలను కలవడానికి సందర్శకులు ఎలా వస్తారో, ఫామ్‌హౌస్‌లోనూ అప్పుడప్పుడు రాజకీయ నాయకులు ఆయన్ను కలవడానికి వెళ్తుంటారు. ఇంకా కొత్తగా ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శిక్షించేదేముంది? అని ప్ర‌శ్నించారు.


విద్వేష రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని.. ప్ర‌జ‌లే అధికారాన్ని లాక్కుని ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసి పెద్ద శిక్ష వేశార‌ని రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ అధికారం త‌మ‌దేనని.. ఇక కేసీఆర్ ఫామ్‎హౌస్‎లో దుప్పటి కప్పుకుని పడుకోవాల్సిందేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా చేసిన సంక్షేమం, అభివృద్ధి చూసి ప్రజలే మళ్లీ త‌మ‌ను గెలిపిస్తారని ధీమా వ్య‌క్తం చేశారు. ఇక జూబ్లీహిల్స్ బై పోల్ గురించి మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags
CM Reventh Reddy KCR BRS Telangana Politics Erravalli Farmhouse Telangana
Recent Comments
Leave a Comment

Related News