ఏపీలోని చేనేత రంగానికి ఎంతో చేశామని.. అయితే.. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని.. సీఎం చంద్ర బాబు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన.. మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత పలువురు మహిళా చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలను తిలకించారు. కొన్ని చీరలను కూడా కొనుగోలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నేతన్నతో టీడీపీకి పేగు బంధం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.
భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు ప్రతీకగా పేర్కొన్న సీఎం చంద్రబాబు వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తాజాగా చేనేత వస్త్రాలపై జీఎస్టీని తామే భరిస్తున్నామని.. ఇది నేతన్నకు మరింత మేలు చేస్తుందని చెప్పారు. త్వరలోనే రాజధాని అమరావతిలో `హ్యాండ్లూమ్ మ్యూజియం` ఏర్పాటు చేయనున్నట్టు సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. నేతన్నలు సమర్పించిన.. సమస్యలపై పరిశీలించి.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నైపుణ్యంతో పాటు.. ఇన్నోవేషన్‌ను కూడా జోడించి.. నేతన్నలు వస్త్రాలను రూపొందిస్తున్నారని చంద్ర బాబు వ్యాఖ్యానించారు. వారి వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్ లభించేలా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. వ్యవసాయ రంగంతోపాటు.. చేనేత రంగం ఉపాధికి ఎంతో కీలకంగా మారిందన్నారు. అందుకే. రాష్ట్రంలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తద్వారా వారి వ్యాపారాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఇస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచుతున్నామన్నారు. అలానే.. 50 ఏళ్ల వయసు దాటిన నేత కార్మికులకు సామాజిక భద్రతా పింఛను ఇస్తామని.. చెప్పారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే ప్రక్రియ కొనసాగుతోందన్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికే 55,500 మంది చేనేత కార్మికులకు రూ.2 లక్షలు చొప్పున అప్పుగా ఇచ్చామన్నారు. నేతన్నల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.