వైసీపీ అధినేత జగన్ బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో మిస్టరీ ఇంకా వీడలేదని.. ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత వ్యాఖ్యానించారు. వివేకాను మేమే చంపినట్టు ప్రచారం చేస్తు న్నారని వైసీపీ నాయకులపైనా.. జగన్ కుటుంబంపైనా ఆమె విమర్శలు గుప్పించారు. తాజాగా సునీత, ఆమె భర్త ఇరువురు.. కడప ఎస్పీతో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టులో సిబీఐ వేసిన అఫిడవిట్... కేసును విచారించాల్సిన అవసరం లేదని చెప్పడం వంటి విషయాలపై ఆయనతో చర్చించారు.
వాస్తవానికి 2019, మార్చిలో జరిగిన వివేకా దారుణ హత్య అనేక మలుపులు తిరిగింది. సీబీఐ విచారణ.. ఇదేసమయంలో సీబీఐ అధికారులపైనే కేసులు.. మధ్యలో హత్యలో పాల్గొన్న దస్తగిరి అప్రూవర్గా మార డం.. ఇలా.. అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సీబీఐ అధికారులు ఈ కేసులో విచారణ ముగిసిందంటూ.. సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే. దీనిపై అభ్యంతరం తెలపాలన్నది సునీత సహా.. వివేకా బంధువులు చెబుతున్న మాట. ఈ విషయంపై తేల్చుకునేందుకే సునీత దంపతులు పులివెందులకు చేరుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత.. ``మానాన్నను మేమే చంపినట్టుగా.. కొందరు సంతకం చేయ మన్నారు. ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు ఎమ్మెల్యే), బీటెక్ రవి(టీడీపీ నేత), సతీష్ రెడ్డి(ఎమ్మెల్సీ) ముగ్గురే కారణమని రాసుకువచ్చారు. వీరిపై అభియోగాలు మోపి.. జైలుకు పంపించేలా సహకరించు.`` అని కోరారు. కానీ, ఆనాడు తాను సంతకం చేయలేదన్నారు. వాస్తవానికి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని.. సునీత నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
పోలీసులను బెదిరించి స్పాట్‌లో రక్తపు మరకలను తుడిచేశారని సునీత చెప్పారు. అవినాష్‌రెడ్డి అనుచరులే పోలీసులను బెదిరించారని ఆమె మరోసారి ఆరోపించారు. ఇక, ఇప్పుడు కూడా.. అదే పని జరుగుతున్నట్టు సునీత అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలోనూ.. వైసీపీ నేతలు బెదిరింపులు, హత్యారాజకీయాలు చేసేందుకు వెనుకాడడం లేదని ఆరోపించారు.
ఈ క్రమంలోనే తమ మనిషి, బంధువు కూడా అయిన సతీష్‌రెడ్డిపై దాడికి తెగబడ్డట్టు తెలుస్తోందన్నారు. వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని.. తమ వారికి రక్షణ కల్పించాలని సునీత కోరారు. ఇక, వివేకా కేసు 6 ఏళ్లు దాటిపోయినా.. కొలిక్కిరాలేదన్నారు. దోష నిర్ధారణ జరగకుండానే సీబీఐ విచారణ ముగించేసిందని.. దీనిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తన తండ్రిని హత్య చేసిన నేరస్థులంతా బయటే ఉన్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడలేదని, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. న్యాయం కోసం ఇంకా ఎన్ని రోజులు పోరాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.